బంగాల్ నుంచి టాటా మోటార్స్ వైదొలిగి సుమారు 13 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ రాష్ట్రం 'పరిశ్రమల వ్యతిరేకి'గా పడిన ముద్రను చెరిపేసుకోలేక పోయింది. తయారీ రంగ సంస్థలు రాష్ట్రంలోకి రాలేని పరిస్థితిని ఇంకా మారలేదు. ప్రభుత్వం ఎన్ని పెట్టుబడి సదస్సులు నిర్వహించినా పెద్దగా ఫలితం లేదు. ఇప్పుడు ఇదే అంశం ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న భాజపా ఈ విషయాన్ని ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది.
చారిత్రక కారణం..
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంస్థలు ముందుకు రాకపోవడానికి కారణం రాష్ట్ర చరిత్రలోనే ఉంది. అందులో టాటా మోటార్స్ ఘట్టం ముఖ్యమైనది.
నానో కార్ల తయారీ కోసం బంగాల్లోని సింగూర్‌లో ఫ్యాక్టరీ నిర్మించాలని టాటా మోటార్స్ భావించింది. ఇందుకోసం అప్పటి వామపక్ష ప్రభుత్వం 997 ఎకరాల భూమిని కేటాయించింది. బ్రిటీష్ కాలానికి చెందిన 1894 భూసేకరణ చట్టం ప్రకారం.. ఈ భూమిని సేకరించడంపై వివాదం చెలరేగింది. అప్పటి విపక్ష నేత మమతా బెనర్జీ దీన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారీ నిరసనలు చేపట్టారు. సారవంతమైన నేలను ఫ్యాక్టరీ కోసం సేకరించడాన్ని నిరసిస్తూ.. 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఈ ఆందోళనలు రక్తపాతానికి దారితీశాయి. రాజకీయ దుమారం తారస్థాయికి చేరడం వల్ల ప్లాంటును సింగూరు నుంచి గుజరాత్‌కు తరలించింది టాటా మోటార్స్.
ఇదీ చదవండి: బంగాల్ దంగల్: నందిగ్రామ్‌లో మళ్లీ ఆనాటి రక్తపాతం!
మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఓ చట్టాన్ని రూపొందించారు. దీనిపై టాటా మోటార్స్ కోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 997 ఎకరాల వ్యవసాయ భూమిని తిరిగి సొంత యజమానులకు అప్పగించాలని ఆదేశించింది.
ఇలా.. పరిశ్రమల విశ్వాసాన్ని బంగాల్ ప్రభుత్వం కోల్పోయినట్లైంది. పారిశ్రామికీకరణ కుంటుపడింది.
బుద్ధదేవ్ ప్రయత్నించినా...
రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ప్రభుత్వం నుంచి అధిక శ్రద్ధ కనిపించింది బుద్ధదేవ్ భట్టాచార్య కాలంలోనే. బంగాల్లో వామపక్షాలకు ఉన్న పరిశ్రమల వ్యతిరేక ముద్రను తుడిచేయాలని బుద్ధదేవ్ ఆశించారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమలే భవిష్యత్తు అనే భావనను ప్రజల్లో పెంపొందించాలనుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ పర్యటనలు చేశారు. అప్పటి రాష్ట్ర సెక్రెటేరియట్ అయిన 'రచయితల భవనం'లో 'పరిశ్రమలు-పెట్టుబడులు' అనే రెండు పదాలే తరచుగా వినిపించేవి.
ఇదీ చదవండి: బంగాల్ బరి: అలజడుల నందిగ్రామ్‌లో గెలుపెవరిది?
అయితే, బుద్ధదేవ్ ప్రయత్నించినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. ఆయన స్వప్నం కార్యరూపం దాల్చలేదు. పెద్ద పరిశ్రమలేవీ రాష్ట్రానికి రాకపోవడం అటుంచితే.. సింగూరు, నందిగ్రామ్ హింసకాండ తాలూకు చేదు జ్ఞాపకాలు రాష్ట్రాన్ని వెంటాడటం ఆగలేదు.
దీదీ వచ్చినా..
వామపక్షాల తర్వాత అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ సైతం మార్పు దిశగా అడుగులు వేశారు. అనంతరం పరిశ్రమల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. పెట్టుబడి సదస్సులు, కాంక్లేవ్లు, సమావేశాలు, పర్యటనలు, కార్యక్రమాలు నిర్వహించారు. గత పదేళ్లలో అనేక ప్రపంచవ్యాప్త సదస్సులు నిర్వహించారు. ఇన్ని చేసినా.. రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు అంతంతమాత్రమే. రాష్ట్రంలో వాతావరణం వ్యాపారానికి పూర్తిగా అనుకూలమంటూ ప్రభుత్వం ఎన్ని గణాంకాలు వల్లె వేసినా ఫలితం శూన్యం. సర్కారులోని వ్యక్తులే ప్రభుత్వ గణాంకాలను విశ్వసించే పరిస్థితి లేదు.
భాజపా మార్పు మంత్రం
ఇప్పుడీ పారిశ్రామికీకరణ విషయం బంగాల్ ఎన్నికల్లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మాట భాజపా నుంచి రావడం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ మోడల్‌తో బంగాల్‌ను అభివృద్ధి చేస్తామని భాజపా చెబుతోంది. ఆ రాష్ట్రం నుంచి వచ్చి పీఎంగా ఎదిగిన మోదీని ఉదాహరణగా చూపిస్తోంది.
రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. పరిశ్రమలతో రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. భాజపా అధికారంలోకి వస్తే పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేస్తామని హామీ ఇస్తున్నారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, బంగాల్లో నవశకం మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారు.
సమస్య మూలం అదే
అయితే సమీప భవిష్యత్తులో అంత సులభంగా పారిశ్రామికీకరణ సాధ్యమవుతుందా? అనేది రాష్ట్ర చరిత్ర గురించి తెలిసినవారి నుంచి వ్యక్తమయ్యే ప్రశ్న. ఈ ప్రశ్నకు మూలం అక్కడి భూస్వామ్య విధానంలో ఉంది. ఒకేసారి భారీ మొత్తంలో భూమిని సేకరించడం బంగాల్లో దాదాపు అసాధ్యం. దీని వల్ల నష్టం కలిగేది ఎక్కువగా తయారీ రంగానికే. టాటానే కాదు.. ఎల్ అండ్ టీ సైతం బంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావించి వెనక్కి తగ్గింది. భూమి దొరకక థర్మల్ ప్లాంటును అక్కడి నుంచి తరలించింది. పరిశ్రమల కోసం భూసేకరణ చేసేది లేదన్నది తృణమూల్ కాంగ్రెస్ వైఖరి. భూసంస్కరణల తర్వాత కూడా ప్రభుత్వం భూసేకరణ విధానాన్ని మార్చకపోతే.. బంగాల్లో పెద్ద పరిశ్రమలు నెలకొల్పే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తు ఎలా?
తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే పరిశ్రమల కోసం భూసేకరణలో ఉన్న అడ్డంకులు యథావిధిగా కొనసాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మమతను ఓడించి భాజపా అధికారం చేపడితే.. రాత్రికి రాత్రి మార్పులేవీ జరగవని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు-పరిశ్రమల విషయంలో అందే సంకల్పంతో ముందుకెళ్తారో లేదో అనేది మరో సందేహం. పెట్టుబడుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తే ఏం జరిగిందో బుద్ధదేవ్ హయాంలో తేలిపోయింది. కాబట్టి, భాజపా ఆ దారిలో వెళ్లే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో పారిశ్రామికీకరణ సూత్రాన్ని బంగాల్లో ఎవరు, ఎప్పుడు, ఎలా అమలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. అందుకు ఎంతో సమయం లేదు!
ఇవీ చదవండి: