Viveka murder case CBI enquiry : వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి ఇద్దరినీ అడిగినట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డిని శనివారం రోజు సాయంత్రం సీబీఐ అధికారులు పిలిచి దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డికి సూచించారు. ఈ రోజు సునీతతో కలిసి రావాలని సీబీఐ అధికారులు సూచించగా ఆ మేరకు రాజశేఖర్ రెడ్డి భార్యతో కలిసి సాయంత్రం 4గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 3గంటల పాటు సీబీఐ అధికారులు ఇద్దరినీ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైఎస్ అవినాష్.. సునీత, రాజశేఖర్ రెడ్డిల పైనా ఆరోపణలు చేశాడు.
అవినాష్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో: వైఎస్ వివేకా ఇంట్లో కుటుంబ కలహాలున్నాయని, కనీసం ఆయనకు చెక్ పవర్ లేకుండా చేశారని వివేకా సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖ ఎందుకు దాచి పెట్టారనే విషయాన్ని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీబీఐ అధికారులు ఇద్దరినీ పిలిచి, పలు విషయాలను వాళ్ల ప్రస్తావించినట్లు సమాచారం. కుటుంబ వివరాలు, వివేకా రెండో వివాహం, హత్య జరిగిన విషయం ఎలా తెలిసిందనే వివరాలను సునీతా, రాజశేఖర్ ల నుంచి సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వాళ్లు చెప్పిన విషయాలను సీబీఐ అధికారులు నమోదు చేసుకున్నారు. వీళ్లు చెప్పిన వివరాల ఆధారంగా సీబీఐ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది.
ఉదయ్‌కుమార్ రెడ్డి నేపథ్యంపై ఆరా... వివేకా హత్య కేసులో నిందితుడైన ఉదయ్‌కుమార్ రెడ్డి నేపథ్యంపై సీబీఐ ఆరా తీస్తోంది. చంచల్ గూడ జైలులో ఉంటున్న ఉదయ్‌కుమార్ రెడ్డిని ఆరు రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న విచారించిన సీబీఐ అధికారులు మరో వైపు క్షేత్ర స్థాయిలో ఆయన గురించి వివరాలు రాబడుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్లుగా యుసీఐఎల్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కంపెనీ జనరల్ మేనేజర్ ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. వివేకా హత్య రోజు ఉదయ్ విధుల్లో ఉన్నాడా? లేదా? అని ఆరా తీయడంతో పాటు.. ఉదయ్ కుమార్‌రెడ్డి రికార్డులను సీబీఐ పరిశీలించింది. ఉదయకుమార్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు.
దస్తగిరిని కలిసిన బృందం.. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని సీబీఐ అధికారులు కలుసుకున్నారు. పులివెందులలోని దస్తగిరి ఇంటికి వచ్చిన అధికారులు.. దస్తగిరికి కల్పిస్తున్న భద్రతపై వివరాలు తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉన్నా.. చిన్న అనుమానం కలిగినా తమకు సమాచారం అందించాలని సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విచారణ రేపటికి వాయిదా.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ జాబితాలో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ చివరలో ఉన్నప్పటికీ త్వరగా విచారణ జరపాలని అవినాష్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వు కాపీలు అందకుండానే విచారణ కోరడం సరికాదని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల వచ్చాక వాటిని పరిశీలించి తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.
ఇవీ చదవండి :