మహారాష్ట్ర పాల్గఢ్లో ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత నావికాదళ ఉద్యోగి సూరజ్ కుమార్ మిథిలేశ్ దూబేది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. ఆర్థిక నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న దూబే పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు గుర్తించారు.
పాల్గఢ్లో వెవేజీ అడవుల్లో మంటల్లో కాలిపోతున్న దూబేను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ దూబే పోలీసులకు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతనొక కల్పిత కథ అల్లాడని స్పష్టం చేశారు. అతన్ని డబ్బు కోసం ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. స్టాక్ మార్కెట్లలో భారీగా డబ్బు పోగొట్టుకుని తీవ్ర ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్నాడని తెలిపారు. చివరకు డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి.. కిడ్నాప్‌గా చిత్రీకరించాడని పోలీసులు వెల్లడించారు.
షేర్లలో నష్టాలు..
మృతుడి బ్యాంక్ వివరాలు సేకరించిన పోలీసులు.. షేర్ మార్కెట్లో దూబే రూ.18లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు గుర్తించారు. అంతేగాక బంధువులు, స్నేహితుల వద్ద నుంచి లక్షల రూపాయలు అప్పు చేసినట్లు గుర్తించారు. 13 బ్యాంక్ ఖాతాల నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకున్నట్లు దూబే సిబిల్ స్కోరు ద్వారా వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.
ఒంటరిగా..
చెన్నైలో ఒంటరిగా సంచరించిన దూబే.. స్థానిక పెట్రోల్‌బంకు నుంచి రూ.300 విలువ చేసే డీజిల్‌ను కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా స్పష్టమైందని తెలిపారు. అతను చనిపోయే ముందు పోలీసులకు చెప్పిందంతా కట్టుకథేనని తేల్చారు. అతని అప్పుల గురించి కనీసం కుటుంబ సభ్యులకు తెలియదని పోలీసులు గుర్తించారు.
ఈ కేసు విచారణలో మొత్తం 100 మంది పోలీసు సిబ్బంది 10 బృందాలుగా ఏర్పడి విచారణ జరిపారని పాల్‌గఢ్ ఎస్పీ దత్తాత్రయ షిండే వెల్లడించారు.
ఇదీ చదవండి: నావికాదళ సైనికుడి దారుణ హత్య!