ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అక్కడి స్థానికులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన.. మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని భీవండి పట్టణంలో జరిగింది. మొత్తం వ్యవహారంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
మహారాష్ట్రలో నివాసముంటున్న జమీల్ ఖురేషీపై(38) గుజరాత్‌లో పలు కేసులు ఉన్నాయి. అతడిని పట్టుకునేందుకు స్థానిక అధికారులతో కలిసి గుజరాత్ పోలీసులు.. భీవండిలోని అతను ఉంటున్న ఇంటికి సాధారణ దుస్తుల్లో వెళ్లారు. ఆ సమయంలో వారిని గమనించిన ఖురేషీ ఒక్కసారిగా తాను ఉంటున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అది చూసిన ఖురేషీ కుటుంబసభ్యులు, స్థానికులు.. పోలీసులే చంపారని ఆరోపిస్తూ.. వారిపై దాడికి దిగారు. ఒక ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
పోలీసులపై దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
సెక్యూరిటీ గార్డు మృతి
అదే పట్టణంలో జరిగిన మరో ఘటనలో ఓ ప్రైవేటు సంస్థ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. కనేరీలో కతైలోని విద్యుత్ బిల్లు ఎగవేతదారులకు వ్యతిరేకంగా అధికారులు డ్రైవ్ నిర్వహించారు. వారితోపాటే ఓ ప్రైవేటు విద్యుత్ సంస్థ సెక్యూరిటీ గార్డు కూడా వెళ్లాడు. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్న ఉద్దేశంతో.. అధికారులపై విద్యుత్ బిల్లు ఎగవేతదారులు మూకుమ్మడిగా దాడి చేశారు. వాళ్లను ఎదుర్కొవడానికి వెళ్లిన సెక్యూరిటీ గార్డుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే విద్యుత్ సంస్థలో లోసుగులు ఉన్నాయని.. అవే తన తండ్రి మరణానికి కారణమని మృతుడి కుమారుడు ఆరోపించడం గమనార్హం.
ఇదీ చూడండి: కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురికి గాయాలు