ఓ వజ్రాల వ్యాపారి కేరళలోని ఆలయానికి మూడు నెలల క్రితం భూరి విరాళం ప్రకటించారు. అయితే ఈ నిధుల్ని వినియోగించేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. దాతను సంప్రదించగా వివరాలు సమర్పణకు గడువు కావాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చర్చనీయాంశమైంది.
బెంగళూరుకు చెందిన వజ్రాల వ్యాపారి గాన శ్రవణ్ కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని చొట్టనిక్కర్ భగవతి ఆలయానికి గత నవంబరులో రూ.526 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఆ నిధులు ఎలా వచ్చాయో తెలపాలని ఆలయ పాలకమండలి ఇటీవల కోరింది. బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపుర తాలూకా చింతామణికి చెందిన తాను వజ్రాల వ్యాపారం చేస్తుంటానని, గతంలో తీవ్ర కష్టాల్లో ఉన్న తనను ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఒకరు సూచించడంతో 2016లో వచ్చానని శ్రవణ్ పేర్కొన్నారు. ఆలయాన్ని సందర్శించిన తర్వాత వ్యాపారంలో అమితంగా సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే పెద్దమొత్తంలో విరాళాన్ని ప్రకటించినట్లు చెప్పారు. 60 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. కేరళకు చెందిన దేవాదాయ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరాల్ని తెలుసుకున్న తరువాతనే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి:వ్యాధులే కాదు... ఔషధాలూ అరుదే!