Telangana High Court on Margadarsi: మార్గదర్శిపై ఏపీ సీఐడీ చర్యలను నియంత్రిస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు గురువారం పొడిగించింది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల విచారణలో సీఐడీ చట్ట విరుద్ధమైన చర్యలను సవాలు చేస్తూ మార్గదర్శి సంస్థ, మరికొందరు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. సీఐడీ చర్యలను నియంత్రిస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
మార్గదర్శి కేసుల విచారణలో భాగంగా సోదాలు నిమిత్తం ఏపీ సీఐడీ ఇచ్చిన కేసులను పలువురు సవాలు చేశారు. దీంతో పాటు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వీరిలో బ్రహ్మయ్య అండ్ కో భాగస్వామి పి.చంద్రమౌళి, మార్గదర్శి కార్పొరేట్ కార్యాలయానికి చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ బి.రామకృష్ణారావు, మరో 14 మంది జనరల్ మేనేజర్, సహాయ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వీరంతా ఒకే రకమైన ఆరోపణలతో నమోదు చేసిన ఏడు కేసులను కలిపి ఒకే కేసుగా విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ, సమాచారాన్ని దర్యాప్తు అధికారులు మీడియాకు వెల్లడించడాన్ని సవాలు చేస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, సంస్థ ఎండీ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాసిరెడ్డి విమల్ వర్మ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ కేసులపై విచారణ ఈనెల 28న చేపడతామని న్యాయమూర్తి చెప్పగా ఏపీ తరపు న్యాయవాది ఆగస్టు 2వ తేదీ వరకు గడువు కోరారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు గురువారం వరకే ఉన్నాయని ఆడిటర్ల తరపు సీనియర్ న్యాయవాది బి.నళిన్ కుమార్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు పిటిషన్లపై విచారణను ఆగస్టు 2కు వాయిదా వేశారు.
మార్గదర్శి చందాదారులకు ఊరట: చందాదారుల ప్రయోజనాలను కాపాడటం అనే ముసుగులో మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థకు చెందిన 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రార్లు నిలిపివేశారు. గుంటూరు, పల్నాడు, అనంతపురం చిట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఈ ఏడాది జూన్ 20న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు చందాదారులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కోర్టును ఆశ్రయించిన వారిలో జె.మాధవి, వై.సాగరేశ్వరరావు, పి.హరినాధప్రసాద్‌తో పాటు మరికొందరు ఉన్నారు. గ్రూపుల నిలిపివేత విషయంలో చందాదారులకు, మార్గదర్శికి నోటీసు కూడా ఇవ్వకుండా రిజిస్ట్రార్లు యాంత్రికంగా, ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మీనాక్షీ అరోడా, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ నెల 17న ఇరువైపుల వాదనలు ముగిశాయి. జూన్ 20న డిప్యూటీ రిజిస్ట్రార్లు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ న్యాయమూర్తి మంగళవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.