ఓ అమ్మాయి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి ట్రాప్ చేశాడో వ్యక్తి. ఆ తర్వాత కుక్కలకు, గుర్రాలకు వేసే ఇంజక్షన్ వేసి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఫజల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తోంది. కిద్వాయ్ నగర్‌కు చెందిన అర్జున్ సింగ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను ఓసారి కలుద్దామని పిలిచాడు. అనంతరం ఆమెకు కుక్కలు, గుర్రాలకు వేసే ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను నాలుగు రోజుల పాటు బందీగా ఉంచి.. మళ్లీ పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు నిందితుడు. ఆ దారుణాన్ని వీడియో తీసి.. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అయితే, కొద్ది రోజుల తర్వాత కూడా ఫోన్ చేసి తన వద్దకు రావాలని.. లేకుంటే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు.. ఫజల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా జూన్ 6న మళ్లీ బాధితురాలికి వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ దాడికి పాల్పడతానని బెదిరించాడు. దీనిపై బాలిక తరఫు న్యాయవాది.. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని చెప్పారు.
దుండగుల దాడిలో విద్యార్థిని మృతి..
బిహార్‌లో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు నలుగురు దుండగులు. అనంతరం వారిద్దరిపై దాడి చేశారు. అందులో ఓ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మృతి చెందింది. మరో విద్యార్థిని అక్కడ నుంచి పారిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వైశాలి జిల్లా కర్తాహ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కోచింగ్ సెంటర్ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో దారి మధ్యలో బైక్‌పై వచ్చిన నలుగురు దుండగులు వారిని అడ్డగించి లైంగికంగా వేధించారు. ప్రతిఘటించిన వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో అందులోని ఓ అమ్మాయి పారిపోయి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
ఇంతలో దుండగుల చేతుల్లో తీవ్రంగా గాయపడిన బాలిక మెదట స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని అడుగులేసి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మృతి చెందిందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మైనర్‌పై ఆరుగురు గ్యాంగ్‌రేప్..
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. 14 ఏళ్ల మైనర్‌పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీసి.. బాధితురాలిని బెదిరించారు. దాదాపు ఆరు నెలల పాటు.. ఆమెను రాత్రి వేళల్లో పిలుస్తూ వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.