పంజాబ్‌లోని బఠిండా-దిల్ కంబౌ జాతీయ రహదారి.. సమయం మధ్యాహ్నం ఒంటి గంట. శ్రీ గురు హరగోబింద్ థర్మల్ ప్లాంట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గుండె సమీపం నుంచి ఆరు అడుగుల పొడవైన ఓ ఇనువు రాడ్డు దూసుకుపోయింది. ఈ భీకర దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా నిశ్చేష్టులయ్యారు.
ఇలా జరిగింది..
హర్దీప్‌సింగ్ అనే వ్యక్తి టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తుండగా దాని టైరు పేలి పోయింది. ఈ వాహనం ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీ కొనడం వల్ల అందులోని ఆరు అడుగుల ఇనుప చువ్వ హర్దీప్ ఛాతిలోకి చొచ్చుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానిక యువకులు హర్దీప్‌ను సమీపంలోని ఆదేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్స ప్రారంభించారు.
ముందుగా శరీరం బయట ఉన్న ఇనుప రాడ్డును.. కట్టర్ సాయంతో కత్తిరించారు. తర్వాత ఆరుగురు సర్జన్లు.. 15 మంది ఆరోగ్య సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి దిగ్విజయంగా శస్త్రచికిత్స చేశారు. సర్జరీలో విపరీతంగా రక్తం కారుతుండడం.. వైద్యుల బృందానికి పెద్ద సవాలుగా మారింది. అయినా ఆటంకాలను అధిగమించిన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇనుప రాడ్డు కొన్ని అంగుళాలు కిందకు దిగితే గుండె ముక్కలు ముక్కలయ్యేదని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి : మాస్టార్ ఐడియా అదుర్స్- సైకిల్నే 'స్మార్ట్ స్కూల్'గా మార్చి...