మలేరియా పరిశోధనల్లో సంచలనం! మెదడుపై ఆ రుగ్మత ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న వందేళ్ల నాటి చిక్కుముడి వీడింది! ఒడిశాలోని 'సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ కాంప్లెక్స్ మలేరియా' శాస్త్రవేత్తలు ఈ సమస్యకు మూల కారణమేంటన్నది కనుగొన్నారు. సెరిబ్రల్ మలేరియా మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎనాఫలిస్ దోమ కాటు కారణంగా.. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.
ఆధునిక చికిత్స అందించినా, ఇలాంటి బాధితుల్లో 20% మంది చనిపోతూనే ఉన్నారు. చాలా మంది న్యూరో-కాగ్నిటివ్ ప్రభావం కారణంగా మెదడుపై ప్రభావం పడి, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెరిబ్రల్ మలేరియా నుంచి కోలుకున్న కొంతమంది మెదడు ఆరోగ్యంపై 'లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ టాపికల్ మెడిసిన్' బృందంతో కలిసి ఒడిశా శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు.
ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం వల్లే!
"న్యూరో- ఇమేజింగ్ సాంకేతికతను ఉపయోగించి రవుర్కెలాలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన 65 మంది రోగుల బ్రెయిన్ స్నాప్షాట్లను పరిశీలించాం. వీరిలో 26 మంది సాధారణ మలేరియాకు గురైనవారు. బాధితుల వయసును బట్టి వారిలో మెదడువాపు తీవ్రత ఉంటోంది. మెదడులోని అన్ని అంతర్భాగాలకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడం వల్లే మలేరియా రోగులు చనిపోతున్నట్టు గుర్తించాం. ఆక్సిజన్ చికిత్స అందించడం ద్వారా వీరి ప్రాణాలను నిలబెట్టవచ్చా? అన్నది పరిశీలించాల్సి ఉంది" అని సహ పరిశోధకుడు సంజీవ్ మహంతి వివరించారు.