TDP Kanthitho Kranthi Programme: రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని అందరికీ తెలిసేలా గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామంటూ మరో వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పిలుపునిచ్చింది. కాంతిలో క్రాంతి పేరిట ఈరోజు రాత్రి 7గంటల నుంచి 5నిమిషాల పాటు లైట్లన్నీ ఆర్పేసి సెల్ ఫోన్, టార్చులు వేసి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలనంటూ ప్రజలను కోరింది. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోందనీ.. ఆ చీకటిని తరిమికొట్టే క్రాంతి రావాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి చైతన్యవంతులు కావాలని కోరారు.
ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బందించినందున ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 7గంటల 5 నిమిషాల పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లైట్ వెలిగించి మద్దతు తెలపాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది.
రహదారులపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని కోరింది. కాంతితో క్రాంతి పేరిట ఈ కార్యక్రమం నిర్వహణకు చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిలు పిలుపునిచ్చారు. బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.
వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. శాంతియుత నిరసన కార్యక్రమం అన్నిచోట్ల జరిగేలా చర్యలు తీసుకోవాలని నేతలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని.. దీన్ని ఓర్వలేకే ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టిందని నేతలు లోకేశ్‌కు వివరించారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారాభువనేశ్వరి తెలిపారు.
చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారనీ.. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలిసేలా చేద్దామంటూ బ్రహ్మణీ పిలుపునిచ్చారు.
గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లుగానే చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా భారత కాలమానం ప్రకారం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.