TDP Call Babuto Nenu : సైకో ప్రభుత్వాన్ని ప్రశ్నించి... బాబుతోనే నేను అంటూ గొంతెత్తి చాటాలని రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 'బాబుతో నేను' పేరిట ప్రజా చైతన్య కరపత్రాన్ని విడుదల చేసింది. 92612 92612 నెంబర్ కు మిస్డ్ కాల్ (Missed Call) ఇచ్చి "బాబుతో నేను" అని చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. అరెస్టుకు చంద్రబాబు చేసిన తప్పేంటి? అంటూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యల కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం, అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా అంటూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అంటూ పగలు, రాత్రి కష్టపడటం తప్పా అని కరపత్రంలో నిలదీశారు.
Mulakhat with Chandrababu: చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయ కక్షతో చంద్రబాబుపై పెట్టిన కేసును ఖండిద్దామని పిలుపునిచ్చారు. తప్పుడు కేసులపై గళమెత్తుదాం... జగన్ కుట్రను ఎండగడదాం... అంటూ ప్రజా చైతన్య కరపత్రం పంపిణీ చేయనున్నారు. ప్రజల భవిష్యతుకు గ్యారెంటీ ఇస్తూ.. ప్రజల మధ్య ఉన్న చంద్రబాబు ని అర్ధరాత్రి వేళ, అనాగరికంగా అరెస్టు చేసిన విధానాన్ని ప్రజలంతా ఖండించాలని తెలుగుదేశం నేతలు కోరారు. రాష్ట్ర అభివృద్ధి... యువత(Youth) భవిష్యత్ కోసం నిత్యం తపించే చంద్రబాబుపై రాజకీయ కక్షతో అక్రమ కేసు పెట్టారని... ఆధారాలు లేని ఆరోపణలతో జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష కోట్ల అవినీతితో నాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ (Jagan)... తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కు... చంద్రబాబు ని ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్న కక్ష తప్ప... ఆయన అరెస్టుకు కారణాలు, ఆధారాలు లేవని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ రెండేళ్లు విచారణ చేసిన సీఐడీ ఒక్క రూపాయి కూడా దారి మళ్లించినట్లు నిరూపించలేదని విమర్శించారు. 2013లో మోడీ గుజరాత్ ప్రభుత్వం సహా 7 రాష్ట్రాలు సిమెన్స్, డిజైన్ టెక్‌తో కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాయని గుర్తుచేశారు. గుజరాత్ వెళ్లి ఆ ప్రాజెక్టును అధ్యయనం చేసి ఐఏఎస్ ప్రేమ్ చంద్రారెడ్డి సిఫారసులను ఐఏఎస్ అజేయ కల్లాంరెడ్డి ప్రతిపాదించారని... దాన్ని రాష్ట్ర కేబినెట్ (Cabinet), శాసనసభ ఆమోదించాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ స్కిల్ డెవలప్ మెంట్ సేవలు, పరికరాల విలువను మదింపు చేసి ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం నాడు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఇడుపులపాయతో సహా 42 చోట్ల శిక్షణా కేంద్రాలు, 2,13 లక్షల మంది యువతకు శిక్షణ 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. పింక్ డైమండ్, వివేకా హత్య (Viveka Murder), రాజధానిలో అక్రమాలు అంటూ అనేక ఆరోపణలు చేసి రుజువు చేయలేక చేతులెత్తేసిన జగన్... తన పంతం నెగ్గించుకోవడానికి ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసుతో చంద్రబాబుని అరెస్టు చేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి, 40 వేల కోట్ల ఇసుక దోపిడీని సాక్ష్యాధారాలతో బట్టబయలు చేసి చంద్రబాబు సంధించిన ప్రశ్నలతో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు.
కరెంట్ చార్జీల పెంపు, నిరుద్యోగం, అన్నదాత కష్టాలు, బడుగు వర్గాలపై దాడులు, ప్రభుత్వ పన్నుల బాదుడుపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... కుట్రతో చంద్రబాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. కుతంత్రాలతో దేశం గర్వించే నేతపై కక్ష సాధింపును ఖండించాలని కోరారు. మీ బిడ్డల జీవితాలను నిలబెట్టిన పెద్దాయన కోసం ఏకమై నిలబడి...ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర భవిష్యతు కాపాడుకుందామని పిలుపునిచ్చారు.