వలపు వల.. కొద్ది కాలంగా వినిపిస్తున్న కొత్త రకం మోసం. అందంగా కనిపిస్తారు. మాయమాటలతో నమ్మిస్తారు. వారి వలలో చిక్కామో.. అంతే.. వారి అసలు స్వరూపాన్ని బయటకు తీసి లక్షలు కాజేస్తారు. ఇలాంటిదే ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. హనీ ట్రాప్‌లో చిక్కుకున్న ఓ టాటూ ఆర్టిస్.. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
ఏం జరిగింది?
గాజియాబాద్‌లోని రాజ్‌నగర్ ప్రాంతంలో చిన్న దుకాణం పెట్టుకుని టాటూ ఆర్టిస్ట్‌గా జీవనం సాగిస్తున్నాడు బాధిత యువకుడు. టాటూ కోసం తన షాప్‌కు వచ్చినప్పుడు నిందితురాలిని తొలిసారి కలిశాడు. ఈ క్రమంలోనే అతనితో పరిచయం పెంచుకుంది. కొద్ది రోజుల తర్వాత.. తన పుట్టినరోజు వేడుకలకు రావాలని ఆహ్వానించింది. నమ్మి పార్టీకి వెళ్లిన ఆ యువకుడికి బలవంతంగా మద్యం తాగించారు. ఆమెతో పాటు మరికొంత మంది యువకులు ఉన్నారు. మత్తులోకి జారుకున్నాక బాధితుడి అభ్యంతరకర వీడియోలు తీశారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె ఫోన్ నుంచి తన ఫోన్లోకి పార్టీ ఫొటోలు, వీడియోలను పంపించుకునేందుకు ప్రయత్నించగా.. వారి దుర్బుద్ధి తెలిసిందని వాపోయాడు బాధితుడు. అసలు విషయం బయటపడటం వల్ల.. వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించటం మొదలు పెట్టారు. రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని ఆ యువతి బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు బాధిత యువకుడు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు ఆ యువకుడు. తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను అందించాడు. ఆ వీడియోల్లో కొంత మంది యువకులతో కలిసి బాధితుడికి ఓ మహిళ మద్యం తాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఆమె గతంలోనూ హనీ ట్రాప్‌తో పలువురిని మోసం చేసినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
మరోవైపు... బాధిత యువకుడు తనపై అత్యాచారం చేశాడని యువతి సైతం కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:
Khiladi Lady Cheating: ఫేస్బుక్ ప్రొఫైల్స్‌తో కి'లేడి' వలపు వల.. చిక్కారో విలవిల