తమిళనాడు తంజావూరులోని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) డివిజనల్ కార్యాలయం పక్కనే దేశంలో తొలిసారిగా ఆహార మ్యూజియం నిర్మించారు. ఎఫ్‌సీఐ బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలాజికల్ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా ఉన్నాయి. దేశంలో రైతు నుంచి ఎఫ్‌సీఐ గోదాముల వరకూ జరిగే.. ఆహార సేకరణ ప్రక్రియను వర్చువల్ రియాలిటీ ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించారు. ఆహార నిల్వలపై ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు క్విజ్ జోన్ ఏర్పాటుచేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఆహార నిల్వల కోసం ఎఫ్‌సీఐ సాగించిన ప్రయాణాన్ని.. డిజిటల్ గ్యాలరీల ద్వారా ప్రదర్శిస్తున్నారు.
ఏం ఉంటుందీ మ్యూజియంలో..?
పూర్వం భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఆహారాన్ని భద్రపర్చుకోవడమనేది చాలా కష్టంగా ఉండేది. అప్పటి నుంచి నాగరితకలో వచ్చిన మార్పులను ఇక్కడ తెలుసుకోవచ్చు. సాంకేతిక హంగులతో ఆ నాగరికత కళ్లకు కట్టేలా ఆకృతులు చేశారు. ఏయో కాలాల్లో ఎలాంటి నిర్మాణాలు, ఎలాంటి వ్యవసాయ పద్థతులు ఉండేవో స్పష్టంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ నేపథ్యం ఈ రంగంలో వచ్చిన మార్పుల్ని ప్రదర్శనకు ఉంచారు. పూర్వ వ్యవసాయ పద్ధతుల్లో వాడిన పరికరాలు, వాటి ప్రత్యేకతల్ని నమూనాల ద్వారా చూపించారు. పూర్వం ఆహారం కోసం వేట మొదలు.. వ్యవసాయం వైపు మొగ్గుచూపిన తీరును స్వయంగా చూసి తెలుసుకోవచ్చు. వ్యవసాయంలో చీడపీడలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏయో పంటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడ్డాయనేది వివరణాత్మకంగా ప్రదర్శిస్తున్నారు.
డిజిటల్ తెరల్లో..
దేశంలో పంటలు, ఉత్పత్తుల పరంగా సాధించిన విజయాలు సాధారణమైనవేమీ కావు. వాటిని తెలుసుకోవడంతోపాటు అలా వచ్చిన మంచి ఆహారోత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఇక్కడ ఏర్పాటుచేశారు. మనం ఏ ఆహారం తీసుకుంటే.. అందులో ఎలాంటి పోషకాలుంటాయో ఉత్పత్తులవారీగా తెలుసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఉండే వంటలు, వాటిలోని పోషకాల కోసం ప్రత్యేక సెక్షన్‌లో డిజిటల్ తెరల్ని ఉంచారు. ఏయే దేశాల్లో ఎలాంటి ఆహారోత్పత్తుల్ని పండిస్తారు, వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఇక్కడ వివరించారు.
కళ్లకు కట్టినట్లు..
మనదేశంలో ప్రధాన పంట అయిన వరి పొలాల వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు పొడవాటి గ్యాలరీల ద్వారా ఇక్కడ చూపిస్తున్నారు. పంట కోతలయ్యాక రైస్‌మిల్లుకు తరలించడం, అక్కడి నుంచి లారీలు, రైళ్లలో ఎఫ్‌సీఐ గోదాముల దాకా వాటిని తరలించే విధానాన్ని ఆకృతుల ద్వారా వివరిస్తున్నారు. ఇక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు చేరాదాకా వివిధ ప్రక్రియలను తెలియజేస్తున్నారు.
ఇవీ చదవండి: