తమిళనాడు మదురై పనన్గడికి చెందిన శరవణన్, జయశ్రీకి (24) 2018లో వివాహం జరిగింది. 2019లో వారికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త, బిడ్డను వదిలేసి జయశ్రీ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. భార్య కోసం శరవణన్ చాలా రోజులు అన్వేషించినా ఫలితం దక్కలేదు.
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కుటుంబం. నెలలు గడిచినా ఆచూకీ లభించలేదు. అనంతరం మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు శరవణన్. పోలీసులు తన భార్య ఆచూకీ కనుగొనేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు జడ్జీలు అంగీకరించి.. ఆ పనిని పోలీసులకు అప్పగించారు.
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు జయశ్రీ చెన్నైలో దర్శనమిచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను ఇంటిని విడిచిపెట్టి వచ్చినందుకు జయశ్రీ చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు.
చెన్నైలో దుర్గాదేవీ అనే మహిళతో కలిసి జీవిస్తోంది జయశ్రీ. వీరిద్దరికి 12వ తరగతి నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కూడా వారి మధ్య బంధం కొనసాగింది. ఓ రోజు జయశ్రీ విషయం ఆమె ఇంట్లో తెలిసిపోయింది. ఆమెను తిట్టి హడావుడిగా పెళ్లి ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. అలా దుర్గాదేవీని విడిచి.. శరవణన్‌ను పెళ్లి చేసుకుంది జయశ్రీ.
విడిచి ఉండలేక..
వివాహం జరిగిన తర్వాత కూడా దుర్గాదేవీని మర్చిపోలేకపోయింది జయశ్రీ. ఆమెను వెతుక్కుంటూ వెళాలని నిర్ణయించుకుంది. కానీ అప్పుడే ఆమె గర్భవతి అని తెలిసి ఆ ప్రణాళికను విరమించుకుంది. బిడ్డ పుట్టిన కొన్ని నెలలకు అందరిని వదిలేసి చెన్నై వెళ్లిపోయింది. దుర్గాదేవీని వెతికి పట్టుకుని ఆమెను పెళ్లి చేసుకుంది.
ఈ వ్యవహారంపై ఈ నెల 20న విచారణ చేపట్టంది మదురై బెంచ్. జయశ్రీకి రెండేళ్ల పిల్లాడు ఉన్నాడని, ఆమె వెళ్లిపోతే బిడ్డ పరిస్థితి దారుణంగా ఉంటుందని, అందుకే ఐపీసీ సెక్షన్ 317 కింద ఆమెను భర్తతో పంపాలని శరవణన్ తరఫు న్యాయవాది వాదించారు. ఇందుకు బదులుగా.. 'నేను-దుర్గాదేవీ 12వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నాం. నాకు దుర్గాదేవీతో కలిసి జీవించాలని ఉంది,' అని జస్టిస్ భారతీదాసన్, జస్టిస్ ఆనందితో కూడిన బెంచ్‌కు విన్నవించుకుంది జయశ్రీ.
ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. జయశ్రీ ఒక మేజర్ అని, ఆమె దుర్గాదేవీతో వెళ్లొచ్చని తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి:- లైంగిక దాడిలో ప్రతిఘటించకపోతే సమ్మతించినట్లేనా?