Tamil Nadu CM Stalin Interview : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మతతత్వం తప్ప మరో సిద్దాంతం లేదని.. కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను సాధిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి మత సామరస్యమే బలమని చెప్పారు. తమ కూటమి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ.. రాష్ట్రాల హక్కులను కాపాడుతుందన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించే అన్ని ప్రజాస్వామ్య సంఘాలను కలుపుకుని పోయి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయమే నిదర్శనమని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పారు. అప్పులు, ద్రవ్యలోటు లాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా.. కేంద్ర సహకరించకోపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. వివిధ అంశాలపై స్టాలిన్ మాట్లాడారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని డీఎంకే భావిస్తోందా? ప్రస్తుతం మీ ప్రసంగాలు ముందు కన్నా ఎక్కువగా హిందీలో వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రధాని కావాలని అనుకుంటున్నారా?
దేశంలోని మూడో అతిపెద్ద పార్టీగా డీఎంకే ఇప్పటికే అవతరించింది. గత 40 ఏళ్లుగా జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించిన డీఎంకే ప్రతిష్ఠ.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. గతంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలకు మద్దతు ఇచ్చి కరుణానిధి కీలక పాత్ర పోషించారు. వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుకు వెన్నెముకగా డీఎంకే నిలిచింది. బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం కల్పించడంలోనూ డీఎంకే ముందు నిలిచింది. వాజ్పేయీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కేంద్రం స్థిరంగా ఉండేందుకు సహాయ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించి దేశం దృష్టిని ఆకర్షించాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతి బిల్లును హిందీలోనే తీసుకువస్తోంది. గతంలో ఉన్న వాటిని మారుస్తోంది. దీనిపై హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే డీఎంకే స్పందన ఎలా ఉంటుంది?
ఈ అంశంపై మా ఎంపీలు ఇప్పటికే ఉభయ సభల్లో ఆందోళన చేశారు. బీజేపీ రహస్య ఎజెండా ఒకే దేశం ఒకే భాష వల్ల.. కేవలం తమిళమే కాకుండా దేశంలోని అన్ని భాషలూ ప్రమాదంలోకి వెళతాయి. దీనిపై అనేక రాష్ట్రాల్లో అవగాహన సైతం కల్పిస్తున్నాం. ఏ భాషకు తాము వ్యతిరేకం కాదని.. కానీ ఒకే భాషను బలవంతంగా రుద్దడాన్ని అడ్డుకుంటాం. అన్ని భాషలకు సమాన హోదా ఇవ్వాలి.
బీజేపీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ నివేదికను ప్రచురించింది. డిజిటల్ మీడియా, అధికార దుర్వినియోగంపై మీ స్పందన ఏంటి?
బీజేపీ తప్పుడు ప్రచారాలతో వాట్సాప్ యూనివర్సీటీగా పేరు సంపాదించింది. డిజిటల్ మీడియా నుంచి ప్రింట్, టీవీ అన్నింటినీ బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. దీనినే వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది.
రాష్ట్రంలోని దేవాలయాలు హిందూ మత దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వ స్పందన ఏంటి?
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,118 ఆలయాలను నిర్మించాం. ఇప్పటివరకు రూ.5,473 కోట్ల విలువైన 5,820 ఎకరాల దేవాదాయ భూములను స్వాధీనం చేసుకున్నాం. ఇవేమి తెలియకుండానే ప్రధాని మాట్లాడుతున్నారు. మాకు ఎయిమ్స్ కేటాయించాలని కోరినా ఇవ్వరు. నీట్ మినహాయింపు బిల్లును అంగీకరించరు. మాకు రావాల్సిన నిధులు కేటాయించరు. ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్టులు ఇవ్వరు. గత 9 ఏళ్లలో తమిళనాడుకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
కులగణనపై ప్రధాని మోదీకి మీరు బహిరంగ లేఖ రాశారు. కొంతమంది నేతలు రాష్ట్రాలు సైతం కులగణనను చేయవచ్చని అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఏమైనా అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా?
తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లను అందిస్తున్నాం. ఈ కులగణనను 2011లోనే తాము భాగస్వామిగా ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్వహించింది. కానీ ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాటి వివరాలను వెల్లడించడంలేదు. దీనిపై 2015లో నిపుణలు కమిటీని నియమించినా.. ఇప్పటికీ ఆ వివరాలు ప్రకటించడం లేదు.
స్టాలిన్ ఇంకేమన్నారంటే?
మరోవైపు బీజేపీ-అన్నాడీఎంకే కూటమి తెగదెంపులపై స్పందించిన స్టాలిన్.. ఆ అంశాన్ని తాము పట్టించుకోవడం లేదన్నారు. గత 10 ఏళ్ల అన్నాడీఎంకే పాలనలో అస్తవ్యస్తమైన పాలన వ్యవస్థను సరిదిద్ది.. సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. తమ సుపరిపాలనతో వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని.. వారు తమతోనే ఉన్నారని చెప్పారు. 9ఏళ్ల ప్రజావ్యతిరేక బీజేపీ పాలనే ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పడేలా చేసిందన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. కావేరి డెల్టా ప్రాంతంలోని రైతుల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం పోరాడుతోందని చెప్పారు.
Monthly Assistance Scheme for Women : మహిళలకు నెలకు రూ.1000.. కొత్త పథకం ప్రారంభించిన సీఎం