కొవిడ్-19 బారిన పడిన రోగుల ఇళ్ల బయట పోస్టర్లు, ఇతర సంకేతాలు వంటివి అంటించొద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది . ఈ అంశంపై కేంద్ర మార్గదర్శకాలను పరిశీలించిన క్రమంలో ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే.. ప్రత్యేక కేసుల విషయంలో విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తే మాత్రం అంటించొచ్చని అభిప్రాయపడింది.
కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించటాన్ని ఆపాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, కాబట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అలాంటి పోస్టర్లు అంటించొద్దని స్పష్టం చేసింది. అనంతరం వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
కొవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించటంపై తమ మార్గదర్శకాల్లో ఎలాంటి సూచనలు లేవని ఇంతకుముందే కోర్టుకు విన్నవించింది కేంద్రం. ఎవరినీ కించపరిచే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి: 'ఇళ్లపై పోస్టర్లతో అంటరానివారిగా కొవిడ్ రోగులు'