తన గర్భాన్ని అద్దె(సరోగసీ)కు ఇచ్చిన మహిళకు, ఆమె ప్రసవించబోయే బిడ్డకు మధ్య జన్యుపరమైన బంధమేదీ ఉండదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరోగసీ చట్ట నిబంధనలకు సంబంధించి ఈ వివరణను ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం...తన బీజకణం/శుక్లధాతువును ఇచ్చే మహిళ సరోగసీ అమ్మ కాబోదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్న దంపతులతో సరోగసీ విధానంలో జన్మించబోయే బిడ్డ... జన్యుపరమైన బంధాన్ని కలిగి ఉండాలని తెలిపింది. భర్త వీర్యం, భార్య మాతృజీవకణాలతో రూపొందిన పిండం మరో మహిళ(సరోగసీ) గర్భంలో పెరుగుతుందని వివరించింది. భర్తతో విడిపోయిన, విధవరాలైన మహిళల విషయంలో అయితే ఆమె శుక్లధాతువును అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది.
సరోగసీ నియంత్రణ చట్టం-2021, సహాయత పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ (ఏఆర్‌టీ) చట్టం-2021లోని వివిధ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం ఈ వివరణలను తెలియజేసింది. అద్దె గర్భం(సరోగసీ)ను వ్యాపార సాధనంగా మార్చడాన్ని ఈ చట్టం నిషేధించింది. అయితే, 35 ఏళ్ల వయసు పైబడిన వివాహేతర మహిళలు సరోగసీ విధానంలో బిడ్డను పొందే హక్కును గుర్తించాలని, తద్వారా ఆమె మాతృమూర్తిగా మారే అవకాశాన్ని కల్పించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.