Supreme Court Order to Stop Hearing Against Margadarsi Cases in AP High Court: తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శిపై నమోదు చేసిన కేసులపై విచారణ జరపవద్దని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం, సీఐడీకి నోటీసులు దేశోన్నత న్యాయస్థానం జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 2024 ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.
మార్గదర్శిపై నమోదు చేసిన అన్ని కేసులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని మార్గదర్శి సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ విచారణలో మార్గదర్శి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఒకే అంశంపై వేర్వేరు కేసులు నమోదు చేశారని వాటిలో కొన్ని తెలంగాణ హైకోర్టులో విచారణ చేస్తుండగా, మరికొన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం హైకోర్టు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చార్జిషీట్ దాఖలు చేసినట్లు చెపుతున్నందున ఎలా జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇందుకు కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగింది హైదరాబాద్‌లో అని నేరం మోపి విచారణ జరుపుతున్నారని లూథ్రా వివరించారు. గతంలో సుప్రీం కోర్టు ఒక కేసు విచారణను తెలంగాణ హైకోర్టు చేపట్టాలని ఆదేశించినట్టు న్యాయస్థానం ముందుంచారు. తర్వాత కూడా పలు కేసులు నమోదు చేసి విచారణ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.
మార్గదర్శిపై ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు వాటిలో ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న కేసుల వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. అన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వం, సీఐడీకి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ నిలుపుదల చేయాలని లూథ్రా కోరగా, అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏపీ హైకోర్టులో మార్గదర్శి వ్యవహారంలో ఎలాంటి విచారణ జరపవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 2 కు వాయిదా వేసింది.