Supreme Court on Freebies: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలను తీవ్రమైన ఆర్థిక సమస్యగా అభివర్ణించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉచిత హామీలను నియంత్రించే వీలుగా.. ఒక అత్యున్నత కమిటీ ఏర్పాటు చేసేందుకు ఏడు రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, న్యాయవాది కపిల్ సిబల్, సంబంధిత ప్రభుత్వ సంస్థలను కోరింది సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. తదుపరి విచారణ ఆగస్టు 8కి వాయిదా వేసింది.
ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ భాజపా సభ్యుడు, అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిని సమర్థించారు. ఉచిత హామీలతో ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చని ఆయన అన్నారు. మరోవైపు.. పార్లమెంటులో దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా.. ఏ రాజకీయ పార్టీ అలా చేయదని అన్నారు సీజేఐ. కేంద్రం, విపక్షాలు, ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలు అన్నీ కలిసి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని అన్నారు.
ఈ నివేదికను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొన్న ధర్మాసనం.. అంతిమంగా దానిని అమలు చేయాల్సింది మళ్లీ ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. అందుకే అన్ని పక్షాలు చర్చించుకొని.. సూచనలు అందించాలని ఆదేశించింది.
వాటిపై చర్చ వద్దా? ప్రజలకు ఉచితాల గురించి ప్రశ్నించే ముందు.. పార్లమెంటు సభ్యుల పింఛన్లు, ప్రోత్సాహకాల గురించి చర్చ ఎందుకు జరపట్లేదని అన్నారు భాజపా ఎంపీ వరుణ్ గాంధీ. ఎన్నికల్లో ఉచితాలపై చర్చ జరగాలని.. భాజపా సభ్యుడు సుశీల్ మోదీ రాజ్యసభలో డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇలా ట్వీట్ చేశారు వరుణ్.
ఎన్నికల ప్రచారంలో ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుడు ఒకరు కీలక ప్రకటన చేశారు. 'రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 18-60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున అందిస్తాం' అని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్య.. ఐదో అంతస్తు నుంచి దూకి..
బ్రిటిష్ నిష్క్రమణ వెనక అదృశ్య శక్తి.. అమెరికా!
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండోరోజూ ఈడీ సోదాలు.. ఉదయం 8 నుంచే..