సహజీవనం రిజిస్ట్రేషన్‌పై నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సహజీవనం రిజిస్ట్రేషన్‌కు నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశాలించాలంటూ న్యాయవాది మమతా రాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ వ్యాజ్యంపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది ఒక మూర్ఖపు ఆలోచన అని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
'సహజీవనం రిజిస్ట్రేషన్‌కు, కేంద్రానికి సంబంధం ఏంటి? ఇదొక మూర్ఖపు ఆలోచన. ఈ రకమైన వ్యాజ్యాలు దాఖలు చేసే పిటిషనర్‌లను కోర్టు ఖర్చులు చెల్లించమనే సమయం ఆసన్నమైంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం.' అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
'గతేడాది దిల్లీకి చెందిన యువతి శ్రద్ధావాకర్ ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా హత్య చేశాడు. సహజీవనం రిజిస్ట్రేషన్ వల్ల వారి భాగస్వాముల గురించి ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాచారం ఉంటుంది. అలాగే సహజీవనంలో ఉన్నవారికి నేర చరిత్ర ఉంటే అది కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది.' అని వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు.
'వన్ ర్యాంక్- వన్ పెన్షన్'పై..
వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కింద అర్హులైన సాయుధ దళాల కుటుంబాలు, గ్యాలంటరీ అవార్డుల విజేతలకు ఈ ఏడాది ఏప్రిల్ 30 లోగా బకాయిలు చెల్లించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. 70 ఏళ్లు పైబడిన పింఛనుదారులకు జూన్ 30లోగా చెల్లించాలని పేర్కొంది. మిగతా పింఛనుదారులకు సమాన వాయిదాల్లో ఆగస్టు 30, నవంబర్ 30, వచ్చే 2024 ఫిబ్రవరి 28 లోపు బకాయిలను అందించాలని నిర్దేశించింది.
ఏప్రిల్ 30లోపు 30 లక్షల మంది పింఛనుదారులు, గ్యాలంటరీ అవార్డు విజేతలకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 70 ఏళ్లు పైబడిన విశ్రాంత సైనికులకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వాయిదాల్లో జూన్ 30లోపు అందించాలని పేర్కొంది. మిగిలిన 10 నుంచి 11 లక్షల పింఛనుదారులకు 3 సమాన వాయిదాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి చెల్లించాలని తెలిపింది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ విధానంలో 2022 నాటి తీర్పునకు కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో అటార్నీ జనరల్ అందించిన సీల్డ్ కవర్ నివేదికను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆదేశాలు జారీ చేయడంలో రహస్యాలు ఎందుకని ప్రశ్నించారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. కోర్టుల్లో పారదర్శకత ఉండాలని.. వ్యక్తిగతంగా తాను సీల్డ్ కవర్ నివేదికల పట్ల విముఖత చూపుతానని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టుల్లో ఈ సీల్డ్ కవర్ నివేదికల సంప్రదాయానికి స్వస్తి పలకాలని అన్నారు.