అసమ్మతిని అణచివేసేందుకు, పౌరులను వేధించేందుకు నేర శిక్షాస్మృతిని, ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల హక్కులు కాపాడటం సుప్రీంకోర్టు కీలక బాధ్యతల్లో ఒకటని చెప్పారు. 'సవాలు సమయాల్లో ప్రాథమిక హక్కుల రక్షణలో సుప్రీంకోర్టు పాత్ర' అనే అంశంపై అమెరికన్ బార్ అసోసియేషన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫర్మ్స్, ఛార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్బిట్రేటర్స్‌లు మంగళవారం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
21వ శతాబ్దంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసహనం, అణచివేతలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత సుప్రీంకోర్టు దేశ పౌరుల హక్కులకు కాపలాదారుగా, రాజ్యాంగం సంరక్షకురాలిగా తన బాధ్యతలను చురుగ్గా నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. అర్ణబ్ గోస్వామి వెర్సస్ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేసును ఉదహరిస్తూ.. పౌరులు స్వేచ్ఛను కోల్పోకుండా రక్షణ కల్పించడమే కోర్టుల ప్రథమ కర్తవ్యమన్నారు. ఒక్కరోజు, ఒక్క వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయినా అది తీవ్రమైనదే అవుతుందన్నారు. అసమ్మతిని అణచివేసేందుకు క్రిమినల్ చట్టాలను ఉపయోగిస్తుంటే కోర్టులు అడ్డుకుంటాయని చెప్పారు.
ఇదీ చదవండి : 'అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు'