ETV Bharat / bharat

ఉచితాలపై భాజపా సహా అన్ని పార్టీలూ ఒకేవైపు, అందుకే మేమే తేలుస్తాం - సుప్రీంకోర్టు ఉచిత పథకాలు

రాజకీయ పార్టీల ఉచితాల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకే పక్షాన ఉన్నాయని పేర్కొంది. ఉచితాల విషయంలో సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

SC-FREEBIES
SC-FREEBIES
author img

By

Published : Aug 23, 2022, 9:36 PM IST

Updated : Aug 24, 2022, 6:53 AM IST

ప్రజాస్వామ్య దేశంలో ఒక అంశంపై చర్చించి చివరకు నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పునరుద్ఘాటించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ పార్టీలు అమలుచేసే ఉచిత పథకాలను నియంత్రించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ భాజపా నేత అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ మంగళవారం సుమారు గంటపాటు వివిధ పక్షాల వాదనలు విన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, వికాస్‌సింగ్‌, అభిషేక్‌ సింఘ్వి, గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌ల వాదనలను పరిగణనలోకి తీసుకున్నారు.

చర్చ కోసం నా భావాలు చెబుతున్నా
''పార్లమెంటులో చర్చకు ఒక నేపథ్యం ఉండాలి. దానికోసం నేను ఈ చర్చను ప్రారంభించి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావించాను. నా మనసులో ఉన్న భావాలను చర్చ కోసం చెబుతున్నాను. ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం సభ్యులు, ప్రతిపక్ష, అధికార పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర నేతలతో కమిటీ ఏర్పాటు చేయాలని వివిధ పక్షాల న్యాయవాదులు సూచిస్తున్నారు. వాటన్నింటికీ ఓకే చెప్పినప్పటికీ ఆ కమిషన్‌కు ఎవరు నేతృత్వం వహించాలన్నదే ప్రశ్న. నాకు తీర్పు రాయడానికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రజల సంక్షేమం గురించి ఆసక్తి ఉన్నవారు రెండింటినీ దృష్టిలో ఉంచుకొని సూచనలు చేస్తారేమోనన్న ఉద్దేశంతో ఉచిత పథకాలపై చర్చ మొదలుపెట్టాం. అలా వచ్చిన సూచనలను పార్లమెంటు ముందు పెడితే అక్కడ చర్చించి చట్టం చేస్తారేమోనని భావించాను. అందుకే తొలుత నేను కమిటీ, కమిషన్‌ ఏర్పాటు లాంటి విషయాల గురించి చెప్పాను. ఇప్పుడు నాకు పెద్దగా సమయం లేదు. ప్రతిపక్ష పార్టీలు కనీసం కమిటీ కూడా ఏర్పాటు చేయొద్దంటున్నాయి. ప్రస్తుతం కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. అది చేసే సిఫార్సులను తప్పనిసరిగా ఆమోదించాలని చెప్పడం లేదు.

మేమే చట్టాలు చేస్తామని చెప్పడం లేదు
ఉచిత పథకాల అమలు అంశంపై ఎంతవరకు విచారించవచ్చు? అన్నది వేరే విషయం. అంతేతప్ప మీకు విచారించే అధికారమే లేదనీ, ఇది పూర్తిగా ప్రభుత్వాల విచక్షణాధికార పరిధిలోని అంశమని చెప్పడానికి వీల్లేదు. ఏ రాష్ట్రమైనా ఉచిత పథకం అమలు చేస్తుంటే ఆ సమయంలో ఎవరైనా తమకు అన్యాయం జరుగుతోందని కోర్టును ఆశ్రయిస్తే దానిని మేం పరిశీలించమా? మేం ఏ ప్రభుత్వ విధానాలకు, పథకాలకు వ్యతిరేకం కాదు. ఈ విషయంలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చన్నది ముఖ్యం. మేం మొత్తం అంశాలను పరిశీలించి నిర్ణయిస్తాం. మేమే చట్టాలు చేస్తామని చెప్పడంలేదు. రాష్ట్రాలు ఉచిత పథకాలు అమలు చేయకూడదని కేంద్రం చట్టం చేస్తే.. ఎలాంటి చట్టాలైనా చేసుకొనే అధికారం కేంద్రానికి ఉందనీ, అందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పం. ప్రతి చట్టంపై న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టుకు ఉందని చెబుతాం.

సదుద్దేశంతో చర్చ ప్రారంభించాం
ఎవరేం చెబుతారో, కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో విందాం. రేప్పొద్దున మేం ఏర్పాటుచేసే కమిటీ ఫలానా పథకం సరైనదేనని, అది ప్రజావసరాల దృష్ట్యా అమలు చేయాలని చెబితే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. భాజపా సహా అన్ని రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేయాలంటున్నాయి. ఒకవేళ నేను ఈ అంశాన్ని ఆర్థిక సంఘానికో, నీతి ఆయోగ్‌ పరిశీలనకో పంపితే అవి ప్రభుత్వ సంస్థలని మళ్లీ మీరే అంటారు.

రెండు అంశాలపై స్పష్టత కావాలి
ఎన్నికల సమయంలో పంచే ఉచితాలు నేరం కాబట్టి ఆ అంశం గురించి కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ అమలుచేసే ఉచిత పథకాల గురించే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతులను పక్కనపెట్టి కేవలం ఉచిత పథకాల కోసం డబ్బు ఖర్చుపెట్టడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఎన్నికల సమయంలో పంచే ఉచితాల వరకే పరిమితమైతే అది ఒక అంశం. అలా కాకుండా ప్రభుత్వాలు సాధారణంగా అమలుచేసే పథకాల గురించి అయితే అది వేరే విషయం కిందికి వస్తుంది. కాబట్టి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అడుగుతున్నారా? ఈ రెండు అంశాలపై న్యాయవాదులు స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల్లో నెగ్గితే ప్రజలందర్నీ హాంకాంగ్‌, సింగపూర్‌కు పంపుతానని ఒక రాష్ట్రంలో ఒక రాజకీయపార్టీ ఎన్నికల సమయంలో చెబుతుంది. అలాంటి వాగ్దానాలు చేయొద్దని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలుగుతుంది? ఆ పార్టీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలిసేంతవరకూ మీరు ఆ డబ్బు ఎక్కడినుంచి తెస్తారని అడగలేం. మనమంతా ఎంతోకొంత వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ఇది చాలా సంక్లిష్ట అంశం.

వేరుచేసి చూడడం కష్టం
''ఉచితాలను వేరుచేసి చూడటం చాలా కష్టం. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు సైకిళ్లు ఇస్తున్నాయి. దానివల్ల ఆడపిల్లలు స్కూళ్లకు వెళ్లడం పెరిగిందని, వాటిని ఉపయోగించుకుని దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారనీ వార్తలు వచ్చాయి. అందువల్ల ఏది ఉచితం? ఏది ప్రజల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న పథకం అని చెప్పడం కష్టం. కల్లుగీత కార్మికులు, క్షురకులు, రజకులకు వారికి పనికొచ్చే పరికరాలు ఇస్తుంటారు. ఆ మాత్రం వస్తువులను వారు కొనుక్కోలేరా అని పట్టణాల్లో మనం అనుకుంటుంటాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గేవారి జీవనోపాధులు ఆ చిన్న పరికరాలపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటివి ఇవ్వడంవల్ల వారి జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. అందువల్ల మనం ఇక్కడ కూర్చొని వాటి గురించి చర్చించలేం. ఇన్ని కోట్లమంది ప్రజల భవిష్యత్తును ఒక కమిటీ నిర్దేశిస్తుందని నేను చెప్పడంలేదు. నేను పార్లమెంటుకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తున్నాను. ఆర్థిక పరిస్థితులను తెలుసుకోకుండా చేసే వాగ్దానాలను అనుమతించకూడదని పిటిషనర్లు అంటున్నారు.. ఆ విషయం రేపు (బుధవారం) చూద్దాం'' అంటూ సీజేఐ జస్టిస్‌ రమణ విచారణను వాయిదా వేశారు.

తమిళనాడు మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
ఉచిత పథకాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదంటూ ఇటీవల తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ వివిధ టీవీ చర్చా కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎంకే తరఫున సీనియర్‌ న్యాయవాది విల్సన్‌ వాదనలు వినిపించడానికి ప్రయత్నించినప్పుడు జస్టిస్‌ రమణ జోక్యం చేసుకుంటూ ''మీ మంత్రి వ్యాఖ్యలపై చెప్పాల్సినవి చాలా ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తిగా స్పందించలేకపోతున్నాను. ఒక వ్యక్తి, ఒక పార్టీకి మాత్రమే విజ్ఞత, విజ్ఞానం ఉందనుకోవద్దు. మేం కూడా బాధ్యతాయుతమైన వ్యక్తులమే. మీరు మాట్లాడిన విధానం చూస్తే మేం కళ్లు మూసుకొని కూర్చున్నట్లు అనిపించడం లేదా?'' అని మండిపడ్డారు. సీజేఐ ధర్మాసనంలో జస్టిస్‌ హిమాకొహ్లి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ఉన్నారు.

Last Updated : Aug 24, 2022, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.