Supreme Court Consumer: వాణిజ్య ప్రయోజనం కోసం బ్యాంకు సేవలు పొందే వ్యక్తి వినియోగదారుడు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వినియోదారుల రక్షణ చట్టం ప్రకారం ఆ వ్యక్తి వినియోగదారుడి పరిధిలోకి రాడని స్పష్టం చేసింది. వినియోగదారుని పరిధిలోకి రావాలంటే.. ఓ వ్యక్తి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందడం కోసం ప్రత్యేకంగా సేవలు పొందినట్లు నిర్ధరించాల్సి ఉంటుందని సర్వోన్నతన్యాయస్థానం తెలిపింది.
అటువంటి వాణిజ్య లావాదేవీలను వినియోగదారుల రక్షణ (సవరణ) చట్టం-2002 పరిధిలోకి రాకుండా చేయడమే చట్ట సవరణ ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ వ్యక్తి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కోసం ప్రత్యేకంగా వాణిజ్య వస్తువులు లేదా సేవలను వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పించడం కూడా ఈ చట్టం ఉద్దేశాల్లో ఒకటని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
పిటిషనర్ శ్రీకాంత్ జీ మంత్రి ఘర్.. తనకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు(ఎన్సీడీఆర్సీ) ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్సీడీఆర్సీ.. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్-1986లోని సెక్షన్ 2(1)(డీ) ప్రకారం పిటిషనర్ వినియోగదారుడు పరిధిలోకి రాడని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీకాంత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఎన్సీడీఆర్సీ తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆ లావాదేవీలు వాణిజ్య ప్రయోజనం పరిధిలోకి వస్తాయని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
ఇదీ చూడండి: 'దావూద్' కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్