SC on R5 Zone Petitions: రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్ వ్యవహారంపై రైతులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం సీజేఐకి రిఫర్ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. అమరావతిపై పిటిషన్ల విచారణను మరో బెంచ్ చూస్తోందని.. అలాంటప్పుడు తాము విచారించడం సరికాదని అభిప్రాయపడింది.
అమరావతి ప్రధాన కేసుతో పాటు ఆర్-5 జోన్ కేసునూ కలిపి విచారించడమే సబబని ధర్మాసనం అభిప్రాయపడింది. శుక్రవారంలోపు ఈ పిటిషన్లపై విచారణకు సంబంధిత ధర్మాసనం ముందు లిస్ట్ చేసేందుకు అనుగుణంగా సీజేఐ నుంచి తగిన సూచనలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెండు పిటిషన్లనూ ఒకే ధర్మాసనం విచారించాల్సి ఉన్నందున.. ఆ మేరకు వ్యవహరించాలని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా సూచించారు. పిటిషన్లను సీజేఐ ముందుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
రైతుల తరఫున హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ, శ్యామ్‌దివాన్, దేవ్‌దత్ కామత్ వాదనలు వినిపించారు. ఆర్ 5 జోన్‌లో ఇప్పటికే పనులు మొదలు పెట్టారని.. తదుపరి విచారణ వరకూ స్టే ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. హరీశ్ సాల్వే అభ్యర్థనకు ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్లు అడ్డుపడ్డారు. అమరావతి పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఆర్ 5 జోన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ లాయర్లు ధర్మాసనానికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని రైతుల తరఫు లాయర్లు తెలిపారు. ఇతరులకు ఇళ్ల స్థలాలపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. పిటిషన్లపై విచారణ ఎప్పుడనేది సీజేఐ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బుధ, గురువారాల్లోనే పిటిషన్లను లిస్ట్ చేయాలని జస్టిస్ అభయ్ ఒఖా స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: