జులై 5 నుంచి ఛార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షల నిర్వహణపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)కు కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు. కరోనా సంబంధిత కారణలతో అభ్యర్థి పరీక్షకు హాజరుకాలేరని ధ్రువీకరించేందుకు అధీకృత వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
కరోనా అనంతర పరిణామాలు నెలల తరబడి ప్రభావం చూపుతాయని, అభ్యర్థి ఆరోగ్య పరిస్థితిని కేవలం నెగటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు ప్రతిబింబించదని సుప్రీం తెలిపింది. కొవిడ్ ప్రభావిత విద్యార్థులకు పరీక్ష రాయాలా వద్దా అనే (ఆప్ట్ అవుట్) ఆప్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
చివరి అవకాశం..
కరోనా కారణంగా మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడి.. జులై 5-20 మధ్య జరగనున్నాయి. పాత సిలబస్లో రాసేందుకు ఇదే చివరి అవకాశం కాగా, నెగటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు సమర్పించిన వారికే ఆప్ట్ అవుట్ ఆప్షన్ ఇస్తామని కోర్టుకు ఐసీఏఐ తెలిపింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అనుమతించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: జేఈఈ-మెయిన్స్ పరీక్షలు వాయిదా!