సుకేశ్ చంద్రశేఖర్.. కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 17 ఏళ్లకే నేర ప్రపంచంలోకి ప్రవేశించి.. వందల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు. జైల్లో కాలక్షేపం చేస్తూ కేవలం ఫోన్ల సాయంతోనే ఏడాదిలో రూ.200 కోట్లను మోసపూరితంగా సంపాదించడం సంచలనం సృష్టించింది. ఈ మోసగాడి బాధితుల్లో అత్యధిక మంది వీవీఐపీలే. సుకేశ్ క్రిమినల్ బ్రెయిన్ చూసి అధికారులే విస్తుపోతున్నారు. మోసపూరితంగా సంపాదించిన సొమ్ముతో సినీతారలకు గాలం వేసి విలాసవంతమైన జీవితం గడిపినట్లు తాజాగా వెలుగు చూసింది.
సీఎం తనయుడి మిత్రుడిగా..
బెంగళూరులోని భవానీనగర్‌కు చెందిన ఓ రబ్బర్ కాంట్రాక్టర్ కుమారుడు సుకేశ్. బిషప్ కాటన్ బాయ్స్ హైస్కూల్‌లో చదివాడు. 10వ తరగతిలోనే చదువు మానేసి మోసాలు చేసి డబ్బు సంపాదించాలని భావించాడు. 2006 నుంచి నేరాలు మొదలుపెట్టాడు. అప్పటికి అతడి వయస్సు 17 ఏళ్లే. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో పనులు చేయిస్తానని చెప్పి చాలా మందిని మోసం చేశాడు. 2007 ఆగస్టులో 76ఏళ్ల సుబ్రమణ్యం అనే వ్యక్తిని మోసం చేసి రూ.1.14 కోట్లు వసూలు చేశాడు. తాను నాటి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడి మిత్రుడిగా పరిచేయం చేసుకొని ఈ నేరానికి పాల్పడ్డాడు. ఆ సొమ్ముతో పార్టీలు ఇచ్చేందుకు ఓ ఇల్లు.. బీఎండబ్ల్యూ, నిస్సాన్, టొయోటా కరోలా, హోండా సిటీ, అకార్డ్ కార్లు, 12 ఖరీదైన వాచ్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, 50 అంగుళాల ఎల్‌సీడీ, నగలు కొనుగోలు చేసినట్లు తేలింది.
కమిషనర్ సంతకం ఫోర్జరీతో..
డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కనీస వయస్సు 18ఏళ్లు. కానీ, సుకేశ్ 17ఏళ్లకే కార్లను నడపడం మొదలుపెట్టాడు. ఇందుకోసం బెంగళూరు పోలీస్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ లేఖను సృష్టించాడు. దానిలో సుకేశ్ కర్ణాటకలో ఎక్కడైనా కార్లను, బైకులను నడిపేందుకు అనుమతిస్తున్నట్లు ఉంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ సీన్లను అనుకరించేవాడు. రకరకాల కొత్త కార్లతో బెంగళూరు డ్రాగ్‌రేస్ సర్క్యూట్‌కు వెళ్లేవాడు.
కరుణానిధి మనవడిగా..
ఆ తర్వాత ఆరేళ్లపాటు పలువురు రాజకీయ నాయకుల కుమారుడిగా, సెక్రటరీగా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఒకసారి డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమారుడిగా చెప్పుకొన్నాడు. ఆ తర్వాత పలు మోసాలు చేసే సమయంలో అప్పటి కేంద్రమంత్రి టీఆర్ బాలు, తమిళనాడు మంత్రి అన్బళగన్, కర్ణాటక మంత్రి కరుణాకర్ రెడ్డి, కర్ణాటక సీఎస్ సుధాకర్ రావు కుమారులుగా, బీఎస్ యడ్యూరప్ప సెక్రటరీగా చెప్పుకొన్నాడు. 2009, 2011లో కూడా అరెస్టయి.. బెయిల్‌పై బయటకు వచ్చాడు.
సుకేశ్ తరచూ పేర్లు మార్చేవాడు. బాలాజీ, శేఖర్ రెడ్డి, రత్నవేలు వంటి పేర్లతో పరిచయం చేసుకొనేవాడు. ఈ క్రమంలో తమిళనాడులో డజన్ల కొద్దీ పారిశ్రామికవేత్తలను మోసం చేశాడు. వివిధ రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం వేట మొదలుపెట్టారు.
2013 నాటికి మోసాలు చేసి రూ. 30 కోట్లు సంపాదించాడు. మోసం చేసే సమయంలో బాధితులను అరుదుగా మాత్రమే కలుస్తాడు. ఫోన్లను మాత్రమే ఎక్కువ వాడేవాడు. కాంట్రాక్టులు, వాణిజ్యం, ప్రభుత్వంలో అధికారుల ర్యాంకులు, వ్యవస్థలోని పెద్దలు చేసే లాబీయింగ్‌లపై అవగాహన పెంచుకొన్నాడు. కొత్త బ్యాంక్ ఖాతాల నిర్వహణకు ఇతడి తండ్రే సాయం చేసేవాడు.
నటి లీనామారియా పౌల్‌కు అబద్ధాలు చెప్పి..!
కేరళకు చెందిన నటి లీనా మారియా పౌల్ (మద్రాస్ కేఫ్ ఫేమ్) కు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొన్నాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన బాలాజీ అనే నిర్మాతగా ఆమెను పరిచయం చేసుకొన్నాడు. ఆమెతో చిత్రం నిర్మిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరయ్యాడు. కానీ, అతడి అసలు పేరు సుకేశ్‌గా తెలిశాక లీనా కొన్నాళ్లు దూరంగా ఉంది. కానీ, ఆ తర్వాత తిరిగి సుకేశ్‌కు దగ్గరై పెళ్లి చేసుకొంది. ఈ జంట కెనరా బ్యాంక్‌ను మోసం చేసి రూ.12 కోట్లు దోచుకొన్నట్లు కేసు నమోదైంది.
కొచ్చికి చెందిన ఎమ్మానియేల్ సిల్క్స్ ప్రచారానికి కత్రినా కైఫ్‌ను తీసుకొస్తానని నమ్మించి రూ.20లక్షలు వసూలు చేశాడు. ఈ ఘటన 2012లో జరిగింది.
ఏఐడీఎంకే గుర్తు కేసులో..!
2017లో ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత పార్టీకి చెందిన రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో సుకేశ్ కూడా నిందితుడు. ఏఐడీఎంకే గుర్తు ఇప్పిస్తానని ఆ పార్టీ నాయకుడు టీటీవీ దినకరన్‌తో రూ.50 కోట్లకు ఒప్పందం చేసుకొన్నాడు. చివరికి ఈ వ్యవహారం బయటపడి దినకరన్‌తో పాటు సుకేశ్ కూడా అరెస్టయ్యాడు. అప్పట్లో సుకేశ్ ఉంటున్న హోటల్ గది నుంచి రూ.1.3 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో అరెస్టయి తిహాడ్ జైలుకు చేరాడు.
ర్యాన్‌బ్యాక్సీ వ్యవస్థాపకుల కుటుంబాలనే మోసం చేసి..!
జైల్లో సుకేశ్ ఖాళీగా కూర్చోలేదు. 2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు వినియోగిస్తూ ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అధితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకొన్నాడు. ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని రూ.200 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ డబ్బు చెల్లించేందుకు ఆ కుటుంబం అప్పులు కూడా చేసింది. ఎన్నాళ్లకూ బెయిల్ రాకపోవడం వల్ల అధితికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. జైలు సిబ్బందికి సుకేశ్ నెలకు రూ.కోటి లంచం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
హీరోయిన్లకు ఎర..!
2020 డిసెంబరు, 2021 జనవరిలో చాలా వారాల పాటు సుకేశ్.. బాలీవుడ్ నటి జాక్వెలిన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కాల్స్‌కు ఆమె స్పందించలేదు. ఓ కేంద్ర మంత్రి ఆఫీస్ నుంచి వచ్చినట్లు తలపించేలా ఆ కాల్ చేసి పరిచయం చేసుకొన్నాడు. ఆ సమయంలో తన పేరు శేఖర రత్నవేలు అని, సన్ టీవీ ఓనర్‌గా చెప్పుకొన్నాడు. అంతేగాక, తాను జయలలిత రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తినని, చెన్నై నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య అతను మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత శివీందర్ కుటుంబం నుంచి సొమ్ము వసూలు విషయం బయటపడింది.
జైల్లో ఉన్న సుకేశ్‌ను కలిసేందుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు, మోడల్స్ వచ్చేవారని పలు పత్రికలు కథనాల్లో పేర్కొన్నాయి. మొత్తం 12 మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: