ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపం అమ్మ. కానీ కొందరు మహిళలు సొంత బిడ్డలను వీధులు, చెత్త కుప్పల్లో పడేస్తూ.. అమ్మతనానికే మచ్చ తెస్తున్నారు. తాజాగా.. ఛత్తీస్గఢ్ ముంగెలీ జిల్లాలోనూ ఇదే జరిగింది. ఓ కర్కశ తల్లి.. నవజాత శిశువును నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళ్లిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ బిడ్డకు ఓ వీధి శునకం తల్లిగా మారింది. తన పిల్లలతో పాటే రాత్రంతా.. కాపాలా కాసింది. ఆ చిన్నారికి ఎలాంటి హానీ తలపెట్టకుండా రక్షణగా నిలిచింది.
జిల్లాలోని సారిస్తాల్ గ్రామంలో.. వీధి శునకం, నాలుగు పిల్లలతో పాటు ఓ నవజాత శిశువు ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. రాత్రంతా ఆ పాపకు శునకాలే రక్షణగా నిలిచాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆ పాపను వదిలేసి వెళ్లిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.
"ఉదయం పనుల కోసం వెళ్తున్న క్రమంలో.. దాదాపు 11 గంటల సమయంలో నవజాత శిశువును గుర్తించినట్లు తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చాను. శిశువు ఏడుపులు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి చిన్నారిని బయటకు తీసి శరీరాన్ని శుభ్రం చేశాం. అక్కడే ఉన్న కొందరు మహిళలు బిడ్డపై ఓ వస్త్రాన్ని కప్పారు. ఆ వెంటనే పిల్లల సంరక్షణ కమిటీకి సమాచారం అందించాం. వారు వచ్చి పాపను ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు."
- మున్నాలాల్, సర్పంచ్.
శునకాలతో పాటు శిశువు ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు వెంటనే లోర్మీ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చింతారామ్.. చిన్నారిని ముంగెలీకి తరలించి చికిత్స అందించారు. పాపకు 'ఆకాంక్ష'గా నామకరణం చేశారు అక్కడి చిన్నారుల సంక్షేమ కమిటీ సభ్యులు. పాపను ఎవరికి అప్పగించాలనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. మరోవైపు.. పాపను వదిలేసిన కుటుంబాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: పిల్ల కొండముచ్చు కోసం తల్లి విలవిల