Stock Market Theme Wedding Card: తమ వివాహా పత్రిక.. సాధారణ శైలికి విభిన్నంగా ఉండాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఇలాగే.. మహారాష్ట్రకు చెందిన ఓ వైద్య జంట.. తమ పెళ్లికి ఆహ్వానిస్తూ రూపొందించిన లగ్నపత్రిక ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'స్టాక్ మార్కెట్ థీమ్'తో ఎంతో సృజనాత్మకంగా రూపొందించిన ఈ వెడ్డింగ్ కార్డ్.. నెటిజన్లను, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది!
ఈ పత్రికలో.. ఆహ్వానించేవారిని ప్రమోటర్లుగా, ఆహ్వానితులను ఇన్వెస్టర్‌లుగా అభివర్ణించారు. లిస్టింగ్(పెళ్లి)లో వధూవరులకు ఆశీర్వాదాలే పెట్టుబడిగా పెట్టాలని కోరారు. 'ఐపీఓ'ను ప్రియమైన వేడుకకు ఆహ్వానం(ఇన్విటేషన్ ఆఫ్ ప్రీషియస్ అకేషన్)గా మార్చారు. పెళ్లి కుమారుడు, కుమార్తెల అర్హతలను మెడిసిన్ లిమిటెడ్, అనస్తీషియా లిమిటెడ్.. ఇలా సంస్థలుగా పేర్కొన్నారు. ఇక వేడుకల రోజులను బిడ్డింగ్ తేదీలుగా, కల్యాణ వేదికను స్టాక్ ఎక్స్ఛేంజీగా, విందును మధ్యంతర డివిడెండ్ పేఔట్‌గా.. పొందుపరిచారు. వెడ్డింగ్ కార్డ్ మొదట్లో.. దేవుళ్ల పేరిట కాకుండా 'ఝన్‌ఝన్‌వాలా.. వారెన్ బఫెట్.. హర్షద్‌లాల్ మెహతా' అంటూ రాయడం గమనార్హం.
పెళ్లిపత్రిక ఆకట్టుకునేలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు! 'ఎంతో వినూత్నంగా ఉంది. బహుశా ఈ జంట స్టాక్ మార్కెట్ వీరాభిమానులేమో' అని ఒకరు కామెంట్ పెట్టారు. 'ఇది వేరే లెవల్ స్టాక్ మార్కెట్ క్రేజ్' అని మరొకరు పేర్కొన్నారు. తాము ఇలాగే కొత్తగా ప్రయత్నిస్తామంటూ కొందరు తెలిపారు. అయితే, ఈ వెడ్డింగ్ కార్డ్ ఏ ఏడాదిదో స్పష్టంగా తెలియరాలేదు. అయితే కల్యాణ వేదిక కర్ణాటకలోని కలబురిగి కావడం విశేషం.