కొత్త కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తోన్న నేపథ్యంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.
"బ్రిటన్ నుంచి వచ్చిన వారి ఆచూకీ కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. వారి జాబితాను కేంద్రం ఇచ్చింది. అందులో ఫోన్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా మంది తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు."
-సంజయ్ భట్నాగర్, లఖ్‌నవూ ముఖ్యవైద్యాధికారి
వందల సంఖ్యలో గోవాకు..
గోవాలోనూ ఇదే పరిస్థితి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇటీవల బ్రిటన్ నుంచి ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ గోవాలో బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 11 మందికి కొవిడ్-19 సోకింది.
క్వారంటైన్‌కు 216 మంది
బ్రిటన్ నుంచి వచ్చిన 216 మంది విమాన ప్రయాణికులను పంజాబ్ అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో మంగళవారం లండన్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలో 8 మందికి కొవిడ్-19 సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా, దక్షిణాఫ్రికా, పశ్చిమాసియాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తక్షణమే కొవిడ్-19 పరీక్షలు నిర్వహించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులు వారిని హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచి ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. అందులో పాజిటివ్ వస్తే వారం రోజులు క్వారంటైన్‌ను పొడిగిస్తారు, నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు.
రష్యాలో రికార్డు స్థాయి కేసులు
రష్యాలో కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం నుంచి ఆ దేశంలో 29,935 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వచ్చిన తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ రష్యాలో 29 లక్షల మందికి కరోనా సోకింది. 53 వేల మంది చనిపోయారు. దక్షిణాఫ్రికా కూడా కరోనాతో అట్టుడుకుతోంది. ఒక్క రోజులో 14 వేల మందికి కొవిడ్-19 సోకినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి : మాస్కుల వాడకంపై 'శాంటాక్లాజ్'తో సందేశం