సరికొత్త రాజకీయాలకు తెరలేపారు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ప్రతీకార రాజకీయాలను దూరంగా పెడుతున్నాననే సంకేతాలనిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా శాసనసభ ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలతో ఓ సలహా ప్యానెల్ ను ఏర్పాటు చేశారు.
మే 13న స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీ తీర్మానం మేరకు ఈ కమిటీలో సభ్యులను ఖరారు చేశారు. 13 మందితో కూడిన ఈ ప్యానెల్ లో అన్నాడీఎంకే నేత, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ ఓ సభ్యుడిగా ఉండటం విశేషం. సీఎం స్టాలిన్ ఈ సలహా కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.
ఈ కమిటీలో డీఎంకే నుంచి డా.ఎన్ ఎళిలన్ సహా పీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, భాజపా, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే, పురట్చి భారతం పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అవసరం ఆధారంగా సలహా కమిటీ భేటీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి: 'దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టిన మోదీ'