భారత్‌లోకి స్పుత్నిక్-వి టీకా వచ్చినట్లు చెప్పారు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్. వచ్చే వారం మార్కెట్లో అందుబాటులోకి వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో దేశ ప్రజల కోసం భారత్‌లోనే మొత్తంగా 216 కోట్ల డోసులు(అన్ని సంస్థలు కలిపి) తయారవుతాయని తెలిపారు పాల్. ఉత్పత్తి పెంపునకు చర్యలు వేగవంతం చేసిన క్రమంలో ప్రతి ఒక్కరికీ అతి త్వరలో టీకా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి మూడు బిలియన్ల డోసులు ఉత్పత్తి అవుతాయని తెలిపారు.
ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో వివిధ సంస్థల టీకా డోసుల ఉత్పత్తి అంచనా ఇలా..
- కొవిషీల్డ్-75 కోట్లు
- కొవాగ్జిన్- 55 కోట్లు
- బయోలాజికల్ ఈ- 30 కోట్లు
- జైడస్ క్యాడిలా- 5 కోట్లు,
- సీరం నోవావాక్స్- 20 కోట్లు
- భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్- 10 కోట్లు
- జెన్నోవా- 6 కోట్లు
- స్పుత్నిక్-వి- 15.6 కోట్లు
" భారత్‌లోకి స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చేసింది. వచ్చే వారం మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని చేప్పేందుకు సంతోషిస్తున్నాం. అక్కడి నుంచి (రష్యా) వచ్చిన పరిమిత వ్యాక్సిన్ల విక్రయాలు వచ్చే వారం ప్రారంభమతాయని ఆశిస్తున్నా. ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో దేశ ప్రజల కోసం భారత్‌లోనే మొత్తంగా 216 కోట్ల డోసులు తయారవుతాయి. త్వరలోనే ప్రతి ఒక్కరి టీకా అందుతుంది.
అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ, డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన ఏ వ్యాక్సిన్ అయినా.. భారత్‌లోకి తీసుకురావొచ్చు. దిగుమతి లైసెన్స్ కేవలం 1-2 రోజుల్లోనే అందుతుంది. ఇప్పటి వరకు దిగుమతి లైసెన్స్‌లు పెండింగ్‌లో లేవు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో విదేశాంగ శాఖ మొదటి నుంచి చర్చలు చేపడుతోంది. భారత్‌కు వ్యాక్సిన్లు పంపటం, భారత్‌లో తయారు చేసేందుకు సుముఖంగా ఉంటే.. సాయం అందిస్తాం. 2021, క్యూ3లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భరోసా ఇచ్చాయి. మన సంస్థలతో కలిసి భారత్‌లో టీకాలు ఉత్పత్తి చేయాలని విదేశాలకు చెందిన సంస్థలను ఆహ్వానించించాం. క్వాడ్ ఆధ్వర్యంలో ఈ ఆఫర్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ అంగీకారం తెలిపింది. "
- డా.వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యులు
ఇతర సంస్థల్లో కొవాగ్జిన్ ఉత్పత్తి!
కొవాగ్జిన్ తయారీ ఇతర సంస్థలకు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని, ఈ అంశంపై భారత్ బయోటెక్‌తో చర్చించినప్పుడు స్వాగతించినట్లు తెలిపారు పాల్. అయితే.. వ్యాక్సిన్ ఉత్పత్తి కేవలం బీఎస్ఎల్3 ల్యాబుల్లోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి కంపనీ వద్ద అలాంటి ల్యాబ్‌లు లేవని.. అన్ని కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్ తయారు చేయాలనుకునే సంస్థలకు సాయం అందిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్‌కు కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!