పద్మశ్రీ మీనాక్షి అమ్మకు.. బాల్యంలో చదువు కంటే నాట్యమంటేనే ఇష్టం. ఆమె ఆసక్తిని, ప్రతిభను గుర్తించిన నాట్యగురువు ఏడేళ్ల చిన్నారి మీనాక్షిని కలరిపయట్టు నేర్చుకోమని సలహా ఇచ్చాడు. ఏడేళ్ల ఆ చిన్నారి జీవితానికే కాదు, కేరళలోని శతాబ్దాల నాటి ఆత్మరక్షణ విద్య కలరిపయట్టు కళకు అదే టర్నింగ్ పాయింట్. దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల నుంచీ ఎంతోమంది దృష్టి కలరిపై పడింది ఆ తర్వాతే. 13 ఏళ్ల తర్వాత ఆడపిల్లలు కలరి సాధన చేయకూడదన్న నిబంధన అప్పట్లో ఉండేది. వడక్కన్ పట్టుకల్లో పుట్టిన మీనాక్షి ఆ నిబంధనను పటాపంచలు చేసింది. 13 ఏళ్లు నిండిన తర్వాతా కలరి సాధన కొనసాగించింది. ఏడేళ్ల వయసులో ప్రారంభించి, 70 ఏళ్లుగా కలరితోనే కలిసి జీవిస్తోంది గురుక్కల్ మీనాక్షి అమ్మ. చీరకట్టులో ఆమె చేసే విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 79 ఏళ్ల మీనాక్షి అమ్మ.. తన చివరి శ్వాస వరకూ కలరిని వీడనని చెప్తోంది. నేర్చుకునే వయసులోనే.. తోటి అబ్బాయిలను చిత్తుగా ఓడించేంది మీనాక్షి.
కలరిపయట్టు జంటగా..
పదో తరగతి తర్వాత చదువు మానేసిన మీనాక్షి.. కలరి గురువు రాఘవన్‌ను వివాహం చేసుకుంది. తర్వాత ఆ కళే ఆమె జీవితంగా మారిపోయింది. కడతనాడు ఆధ్వర్యంలో ఏ ఆలయంలో వేడుకలు జరిగినా.. రాఘవన్, మీనాక్షిల జంట ప్రదర్శన తప్పకుండా ఉండేది. అలా ఈ ఇద్దరికీ కలరిపయట్టు జంటగా పేరొచ్చింది. రాఘవన్ మరణం తర్వాత.. విద్యార్థులకు కలరి నేర్పించే బాధ్యతలు మీనాక్షి తీసుకుంది. భర్త చనిపోయిన 41వ రోజున ఓ వేదికపై ప్రదర్శన ఇచ్చింది. అప్పటినుంచీ వయసుతో పోటీ పడుతూ.. కలరి కోసమే తన జీవితాన్ని కేటాయిస్తోంది మీనాక్షి అమ్మ.
"కొవిడ్ సమయంలోనూ క్రమం తప్పకుండా కలరి సాధన చేశాను. ఏడేళ్ల వయసులో కలరి నేర్చుకోవడం ప్రారంభించాన్నేను. మొదట్లో.. నాట్యంపైనే ఎక్కువ ఇష్టం ఉండేది. పదో తరగతి తర్వాత అసలు చదువు వైపునకే వెళ్లలేదు. పెళ్లి తర్వాత కూడా నా భర్తతో కలిసి కలరి సాధన కొనసాగించాను. ఆ తర్వాత ఈ విద్యే.. నా జీవితమైపోయింది. నా భర్త పూర్తి సహకారమందించారు. ఆయన చనిపోయాక.. కలరి బాధ్యతలు తీసుకుని మరింత చురుగ్గా మారాను. నా పిల్లలు, విద్యార్థులే నా బలం. నేను కలరిలోకి అడుగు పెట్టి 60 ఏళ్లకు పైగానే అవుతోంది. ఇక్కడ నేర్చుకనే వాళ్ల వద్ద నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయం."
- మీనాక్షి అమ్మ, కలరిపయట్టు శిక్షకురాలు
పద్మశ్రీతో..
కలరిపయట్టులో మీనాక్షి అమ్మ నైపుణ్యాలకు, ఆమె తెగువకు గానూ.. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది.
"పద్మశ్రీ పురస్కారం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా భర్త చేసిన కృషి ఫలితమే ఇది. నా పిల్లలు, విద్యార్థులే నా బలం."
- మీనాక్షి అమ్మ, కలరిపయట్టు శిక్షకురాలు
ఆమె స్టేజ్ ఎక్కారంటే.. కన్నార్పరంతే.!
కోజికోడ్ జిల్లాలోని కడతనట్టు కలరి సంఘంలో.. కత్తి, బళ్లెం చేతబట్టి మీనాక్షి అమ్మ చేసే ప్రదర్శనను ఎవరైనా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోవాల్సిందే. స్థానికులంతా ఆమెను సమురై అమ్మ అని పిలుచుకుంటారు. ప్రత్యేక కలరి దుస్తులేవీ ధరించకుండానే.. చీరకట్టుతోనే ప్రదర్శన చేసే మీనాక్షి అమ్మకు అభిమానులు ఎక్కువే. దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోనూ మీనాక్షి గురుక్కల్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆత్మరక్షణ విద్యగానే కాదు.. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలోనూ కలరి పాత్ర ఎంతో ఉందని చెప్తోంది మీనాక్షి. ఒంటినొప్పులకు ఉలిచిల్ పేరుతో మర్దన చికిత్స సైతం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రతి అమ్మాయీ కలరి నేర్చుకుని, సాధన చేయాలని సూచిస్తోంది మీనాక్షి అమ్మ. వేలాది మంది ఆడపిల్లలు ఈమె వద్ద ఈ విద్య నేర్చుకున్నారు. ఆమె పిల్లలు, మనవలు అంతా కలరిపయట్టు నేర్చుకున్నవారే.
"తిరువనంతపురంలో కలరి పాఠశాల ప్రారంభానికి సిద్ధమైంది. పాఠ్యాంశాల్లో కలరిని చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మంత్రులు, అధికారులను ఎప్పుడు కలిసినా ఈ డిమాండ్ వినిపిస్తాను. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేర్చితే.. నా పూర్తి సహకారమందిస్తా."
- మీనాక్షి అమ్మ, కలరిపయట్టు శిక్షకురాలు
కలరి నేర్చుకుంటే పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని చెప్తోంది మీనాక్షి అమ్మ. వారి పాఠ్యాంశాల్లో కలరిని చేర్చితే.. పూర్తి సహకారమందించేందుకు సిద్ధంగా ఉంది.
ఇదీ చూడండి: కళ్లకు గంతలతో పజిల్ పూర్తి..13 ఏళ్లకే రికార్డులు