బంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్‌కు ఎంత ప్రత్యేకత ఉందో సింగూరుకూ అంతే విశిష్టత ఉంది. రాష్ట్రంలో 34 ఏళ్లపాటు అప్రతిహతంగా సాగిన వామపక్ష ప్రభుత్వ పాలనకు తెరదించి, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను అధికార పీఠమెక్కించడంలో సింగూరు కూడా కీలక పాత్ర పోషించింది. కన్నతల్లి వంటి సాగుభూమిని వదులుకోలేక పోరుబాట పట్టిన అక్కడి రైతులు ఇప్పుడు సేద్యానికి దూరమయ్యారు. ఎడారిగా మారిన నేలను చూసి బోరుమంటున్నారు. తమకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను ఏర్పాటుచేయాలని విన్నవిస్తున్నారు. బంగాల్‌లో నాలుగో విడతలో భాగంగా శనివారం సింగూరులో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలిస్తే..
భూసేకరణకు వ్యతిరేకంగా..
కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో.. హుగ్లీ జిల్లాలో సింగూరు ఉంది. అక్కడ నానో కార్ల తయారీకేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు టాటా సంస్థ 2006లో ముందుకురాగా.. బంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వం సమ్మతించింది. 997.11 ఎకరాల భూమిని సేకరించి అప్పగించింది. సారవంతమైన తమ భూమిని ఇవ్వబోమంటూ కొంతమంది రైతులు ప్రతిఘటించినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దానిపై పెద్దయెత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. అన్నదాతలకు దీదీ తోడయ్యారు. 347 ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా సేకరించారని ఆమె ఆరోపించారు. భూమిని రైతులకు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ 26 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. చివరకు టాటా సంస్థ తమ కర్మాగారాన్ని గుజరాత్‌లోని సాణంద్‌కు తరలించింది.
ఆ భూములకు ఏమైంది?
నందిగ్రామ్, సింగూరు వంటి భూపోరాటాలతో రాష్ట్రంలో మంచి ఆదరణ దక్కించుకున్న దీదీ.. 2011లో అధికార పీఠమెక్కారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2016లో సింగూరు భూములను రైతులకు వెనక్కి ఇచ్చేశారు. అయితే- ఏళ్లపాటు సాగుకు దూరంగా ఉండటంతో అవి బీడు భూములుగా మారాయి. నీరు లేక నెర్రలువారాయి. వ్యర్థాలు పేరుకుపోయాయి. చాలాచోట్ల అప్పటికే నిర్మించిన కాంక్రీటు పిల్లర్లు, సిమెంటు స్లాబ్‌లు సాగుకు మరింత ప్రతిబంధకంగా మారాయి. ఉపరితలంపై 7-8 అంచుల మేర మట్టిని తొలగిస్తేగానీ తిరిగి సేద్యం వీలుకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు బిక్కమొహం వేశారు. ఆ నేలల్ని తిరిగి సారవంతంగా మారుస్తామంటూ తృణమూల్ హామీలిచ్చినా.. అందుకు నిధులు భారీగా అవసరమవడంతో అడుగు ముందుకు వేయలేదు.
పరిశ్రమల కోసం డిమాండ్
భూములు సాగుకు పనికి రాకపోవడం సింగూరు రైతులకు శాపంగా మారింది. టాటా ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయాక వేరే పరిశ్రమలూ పెద్దగా రాకపోవడంతో ఇతర ఉపాధి అవకాశాలూ కరవయ్యాయి. చాలామంది వలసబాట పట్టారు. గోపాల్‌నగర్, ఖాసర్‌భెరీ, బెరాబెరీ గ్రామాల్లో మూడు వేలమంది రైతులు ప్రభుత్వం నుంచి నెలనెలా అందే రూ.2 వేల నగదు, 16 కేజీల బియ్యంతోనే పొట్టపోసుకుంటున్నారు. దీంతో తాము గతంలో చేసిన భూపోరాటం సరైనది కాదేమోనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. నానో కార్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటై ఉంటే తమకు, తమ పిల్లలకు స్థానికంగా ఉపాధి దొరికి ఉండేదని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తృణమూల్, భాజపా హోరాహోరీ
ప్రజల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్, భాజపా, సీపీఎం పారిశ్రామికీకరణ జపం చేస్తున్నాయి. నియోజకవర్గానికి పెట్టుబడులు భారీగా తీసుకొస్తామని, పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఇక్కడ భాజపా తరఫున రవీంద్రనాథ్ భట్టాచార్య, తృణమూల్ నుంచి బెచారాం మన్నా, సీపీఎం తరఫున 28 ఏళ్ల విద్యార్థి నేత శ్రీజన్ భట్టాచార్య ఎన్నికల బరిలో నిలిచారు. 2001 నుంచీ రవీంద్రనాథ్ సింగూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 89 ఏళ్లు. వయసు మీదపడటంతో తృణమూల్ టికెట్ నిరాకరించగా.. భాజపాలో చేరి పోటీచేస్తున్నారు. స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. సింగూరు ఉద్యమంలో మమతను వెనకుండి నడిపించింది ఆయనే. రవీంద్రనాథ్‌కు మన్నా గతంలో సన్నిహితుడు. ప్రస్తుతం ప్రధానంగా వారిద్దరి మధ్యే హోరాహోరీ పోరు నడుస్తోంది.
ఇదీ చదవండి : వైకల్యం అడ్డొచ్చినా.. రంగుల ప్రపంచంలో రారాజు!