Sova Android Malware: గుట్టుగా ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి.. వినియోగదారుల రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేయడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో సొమ్మును మాయం చేయగల కొత్తరకం మొబైల్ వైరస్ దేశంలో విస్తరించే ముప్పుంది! భారత్‌లో సైబర్ దాడులను అరికట్టేందుకు కృషిచేసే కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (సెర్ట్-ఇన్) తాజా మార్గదర్శకాల్లో ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. మొబైల్‌లోకి ఈ వైరస్ చొరబడితే.. దాన్ని వదిలించుకోవడమూ అంత సులువు కాదంటూ అప్రమత్తం చేసింది.
ఏమిటీ వైరస్?
ఈ వైరస్/మాల్‌వేర్‌ను 'సోవా' అని పిలుస్తున్నారు. తొలిసారిగా 2021 సెప్టెంబరులోనే సైబరాసురుల మార్కెట్‌లో ఇది ప్రత్యక్షమైంది. భారత్‌లో ఈ ఏడాది జులైలో దీని ఆనవాళ్లు కనిపించాయి. ప్రస్తుతం ఈ వైరస్ ఐదో వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయింది.
నకిలీ ఆండ్రాయిడ్ యాప్‌లలో సోవా నక్కి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు పంపే మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లపై క్లిక్ చేయడం వల్ల కూడా ఫోన్లలో ఈ మాల్‌వేర్ ప్రవేశిస్తుంది.
ఎందుకు హానికరం?
వినియోగదారుల బ్యాంకింగ్ యాప్‌లు/బ్యాంకు ఖాతాల యూజర్ నేమ్‌లు, పాస్‌వర్డులన్నింటినీ ఈ వైరస్ తస్కరించగలదు. సోవా కొత్త వెర్షన్.. క్రిప్టో వ్యాలెట్‌లు సహా 200కు పైగా యాప్‌లను లక్ష్యంగా చేసుకోగలదు.
ఇవీ చదవండి: 'దాచిపెట్టాల్సిందేమీ లేదు.. పారదర్శకంగానే అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తాం'