Southwest monsoon: ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతు పవనాలు ఎప్పటికన్నా కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయి. మొదటగా అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని.. ఈనెల 15న ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. దీంతో వేసవి తాపంతో ఇక్కట్లు పడుతున్న ప్రజలకు త్వరలోనే ఊరట లభించనుంది.
కేరళలో కూడా ఈసారి రుతుపవనాలు ముందుగా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా ఏటా జూన్ 1న రుతు పవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయువ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వెల్లడించింది.
ఇదీ చూడండి : కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి