టెలిఫోన్ తీగ ద్వారా 11కేవీ విద్యుత్తు సరఫరా కావడం, అంతటి హైఓల్టేజీ వద్ద కూడా ఆ వైరు కరగకపోవడమన్నది 'పూర్తి అసంబద్ధం'గా అనిపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ.. ఇద్దరు వ్యక్తులకు శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం పక్కన పెట్టింది.
అసలు ఏం జరిగిందంటే.: 2003లో ఓ వ్యక్తి తన ఇంట్లో టీవీ చూస్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో టీవీ వద్దకు వెళ్లి, అక్కడ కలిసి ఉన్న వైర్లను వేరుచేస్తున్న క్రమంలో అతడు విద్యుదాఘాతానికి గురై, మృతిచెందాడు. టెలిఫోన్ సిబ్బంది స్తంభం పైనుంచి టెలిఫోన్ వైరును నిర్లక్ష్యంగా లాగడం వల్లే... అది విద్యుత్తు తీగకు తగిలి 11కేవీ కరెంటు ప్రసారమైందని, ఆ కారణంగానే సదరు వ్యక్తి మృతిచెందాడంటూ విచారణలో తేల్చారు. ఇందుకు టెలిఫోన్ డిపార్టుమెంటులో పనిచేసే ఓ ఉద్యోగితో పాటు... అతని కింద పనిచేసే దినసరి కూలీని బాధ్యులను చేశారు. కర్ణాటక హైకోర్టు వీరిద్దర్నీ దోషులుగా తేల్చి, ఒక్కొక్కరికి 15 నెలల కారాగార శిక్ష విధించింది. దీంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ హిమాకోహ్లీల ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. ‘‘టెలిఫోన్ తీగ నుంచి 11కేవీ విద్యుత్తు ప్రసారం అవ్వడమన్నది పూర్తి అసంబద్ధం అనిపిస్తోంది. హైఓల్టేజీకి తీగ కరగకపోవడం, అంత హెచ్చుస్థాయి విద్యుత్తు టీవీ గుండా ప్రసారమైనా అది పేలకపోవడం, ఇంటిలోని వైరింగ్ కాలకపోవడం గమనార్హం. తాము అసలు ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదనీ... ఘటన జరిగిన రోజు తాము అసలు స్తంభం ఎక్కి ఎలాంటి తీగల పని చేయలేదనీ అప్పీలుదారులు చెబుతున్నారు. వారిపై వచ్చిన ఆరోపణలన్నీ సాంకేతికతతో కూడుకున్నవి. ఈ కేసులో అసలు సాంకేతిక నిపుణులతో దర్యాప్తు చేపట్టనేలేదు. సందర్భోచిత సాక్ష్యాధారాల వల్ల తొందరపాటు నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలిస్తే... నిందితులను దోషులుగా నిర్ధరించడం అన్యాయం అనిపిస్తోంది. వీరు సంశయ లబ్ధి పొందేందుకు అర్హులైనందున... హైకోర్టు తీర్పును, వారికి విధించిన శిక్షను పక్కన పెడుతున్నాం’’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చదవండి: ముంబయి పేలుళ్లు..29 ఏళ్లకు దొరికిన నలుగురు నిందితులు