పార్లమెంట్లో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన ఆయన.. సభ్యులంతా కఠినమైన, పదునైన ప్రశ్నలు అడగాలని సూచించారు. ప్రభుత్వం సమాధానం ఇచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
"కరోనా మహమ్మారి విషయంపై పార్లమెంట్ బయటా, లోపలా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రజలు కోరుకుంటున్న విషయాలపై సమాధానాలు ఇస్తాం. ఎంపీలందరూ కఠినమైన, పదునైన ప్రశ్నలు అడగాలి. దాంతో పాటే.. ప్రభుత్వం స్పందించేందుకు అనుమతించాలి. ప్రజలకు సత్యాన్ని తెలియజేయడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మెజారిటీ పార్లమెంట్ సభ్యులు టీకా స్వీకరించడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. టీకా తీసుకున్న వ్యక్తులంతా 'బాహుబలులు' అని పేర్కొన్నారు. ఇప్పటికి దేశంలో 40 కోట్ల మంది ప్రజలు బాహుబలులుగా మారారని అన్నారు.