PM Modi Praised ANR In Mann Ki Baat : భారత చలనచిత్ర రంగానికి చెందిన నలుగురు దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాను మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ స్మరించుకున్నారు. దేశానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సినీ ప్రముఖుల శత జయంతి వేడుకలను 2024లో జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ దిగ్గజాలు భారత చలనచిత్ర పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఏఎన్ఆర్ తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని మోదీ కొనియాడారు. ఆయన సినిమాలు భారత సంప్రదాయాలు, విలువలను అందంగా ఆవిష్కరించాయని చెప్పారు. సినిమాల ద్వారా రాజ్ కపూర్ దేశ సాఫ్ట్ పవర్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారని మోదీ తెలిపారు. మహ్మద్ రఫీ మాయాస్వరం ప్రతి శ్రోత హృదయాన్ని తాకుతుందని ప్రధాని అన్నారు. తపన్ సిన్హా సినిమాలు సామాజిక స్పృహ, జాతీయ సమైక్యత సందేశాన్ని అందించాయని గుర్తు చేశారు.
"2024లో పలువురు సినిమా దిగ్గజాల శతజయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ఆ దిగ్గజ నటులు భారత సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చి పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు భారత సంప్రదాయాలు, విలువలను అందంగా ఆవిష్కరించాయి."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'మహాకుంభ మేళా- ఐక్యతా కుంభం'
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభంకానున్న మహా కుంభమేళాను ఐక్యతా మహాకుంభంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. యావత్ దేశం ఐక్యంగా ఉండాలనే సందేశం మహాకుంభ మేళా నుంచి వెలువడాలని చెప్పారు. మహాకుంభ మేళా ప్రత్యేకత విశాలతలోనే కాదు, వైవిధ్యంలో కూడా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కుంభమేళాలో తొలిసారిగా AI చాట్‌బాట్‌ను ఉపయోగించనున్నట్టు తెలిపిన మోదీ మేళాకు సంబంధించిన అన్ని రకాల సమాచారం AI చాట్‌బాట్ ద్వారా 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు.
వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని మోదీ గుర్తుచేశారు. రాజ్యాంగం వల్లే తన జీవితంలో ఈ స్థానానికి చేరుకున్నానని, అది అందరికీ మార్గదర్శకమని ప్రధాని తెలిపారు. రాజ్యాంగంలోని నిబంధనలు, స్ఫూర్తితో ప్రజలను కనెక్ట్ చేయడానికి కాన్‌స్టిట్యూషన్ 75 డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు మోదీ తెలిపారు. రాజ్యాంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయని, వాటిని అధికారపక్షం తీవ్రంగా ఖండిస్తోందని గుర్తు చేశారు.
"2025 జనవరి 26న దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతుంది. అది మన అందరికీ గౌరవించదగ్గ విషయం. రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచింది. రాజ్యాంగం మనకు దారి చూపించే ఓ జ్యోతి వంటిది. మనందరికీ ఓ మార్గదర్శి. భారత రాజ్యాంగం వల్లే నేను ఈ రోజు మీ ముందున్నాను. మీతో మాట్లాడుతున్నాను."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'తమిళం నేర్చుకునేవారి సంఖ్య పెరుగుతోంది'
ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా క్రీడలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. కశ్మీర్‌లో స్కీయింగ్ నుంచి గుజరాత్‌లో గాలిపటం ఎగురవేయడం వరకు క్రీడల పట్ల ఉత్సాహం ప్రతిచోటా కనిపిస్తుందని చెప్పారు. సండే ఆన్ సైకిల్, సైక్లింగ్ ట్యూస్‌డే వంటి కార్యక్రమాలతో సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
వచ్చే ఏడాది తొలి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-వేవ్స్‌ను మన దేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రధాని చెప్పారు. దేశాన్ని ప్రపంచ కంటెంట్ సృష్టికి కేంద్రంగా మార్చడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష తమిళమని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు. ప్రపంచ దేశాల్లో తమిళ భాషను నేర్చుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు.