Snake venom smuggling : దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని.. బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇద్దరు స్మగ్లర్లు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఈ విషాన్ని తరలిస్తున్నట్లు తెలుసుకున్న భద్రత దళాలు.. అనంతరం వారిపై దాడులు జరిపాయి. నిఘా వర్గాల సమాచారంతో సోమవారం బంగ్లాదేశ్, భారత్ సరిహద్దులో కాపుగాసిన భద్రత దళాలు.. అక్రమ చొరబాటును నివారించగలిగాయి. ఘటనలో స్మగ్లర్లు మాత్రం తప్పించుకున్నారు.
పక్కా పథకం ప్రకారం.. నిఘా వర్గాల ద్వారా స్మగ్లర్ల గురించి బీఎస్ఎఫ్ 137 బెటాలియన్‌కు సమాచారం అందింది. వారి కోసం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని పహన్‌పరా గ్రామంలో.. ఓ బృందం రహస్యంగా కాపు కాసింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత.. సుమారు 12.30 గంటల ప్రాంతంలో ఓ ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు.. వారిని అక్కడే ఆగమని హెచ్చరించాయి. దాంతో భయపడ్డ ఆ ఇద్దరు స్మగ్లర్లు.. తిరిగి బంగ్లాదేశ్ వైపే పరిగెత్తారు. వెంటనే వారిపై భద్రత దళాలు కాల్పులు జరిపాయి. కానీ ఆ స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.
అనంతరం ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో సోదాలు జరిపిన భద్రతా దళాలకు.. స్మగ్లర్లు జారవిడిచిన ఓ అనుమానాస్పద సీసా దొరికింది. దాంట్లో పాము విషం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. బాటిల్‌పై 'మేడ్ ఇన్ ఫ్రాన్స్' అని రాసి ఉందని వారు తెలిపారు. బాటిల్లో ఉన్న విషం కోబ్రా పాముదని.. దాని విలువ దాదాపు రూ.13 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అనంతరం ఆ బాటిల్‌ను అటవీ అధికారులకు అందించినట్లు వారు పేర్కొన్నారు. విషం గురించి మరికొంత సమాచారం తెలుసుకోవాల్సి ఉందని.. అందుకు దానికి పరీక్షలు చేయాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు. అయితే తాము జరిపిన కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని భద్రత దళాలు తెలిపాయి.
ఆమె బ్యాగ్‌లో 22 పాములు, ఊసరవెల్లి.. ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు షాక్..
snake smuggling : మూడు రోజుల క్రితం వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లిని స్మగ్లింగ్ చేస్తూ ఓ మహిళ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. 28 ఏప్రిల్ 2023న ఏకే13 విమానంలో కౌలాలంపూర్ నుంచి చెన్నై వచ్చిన మహిళ.. వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికింది. మహిళ చెక్-ఇన్ లగేజీపై చెన్నై విమానాశ్రయం అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే మహిళను అడ్డుకుని ఆమె బ్యాగ్‌లను పరిశీలించారు. ఆ బ్యాగుల నుంచి మొత్తం 22 పాములతో పాటు ఓ ఊసరవెల్లిన బయటకు తీశారు. అనంతరం కస్టమ్స్ చట్టం 1962, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద మహిళపై కేసు నమోదు చేశారు. వన్య ప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చెన్నై కస్టమ్స్ అధికారులు సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.