Six Teenagers consumed poison: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడాలని భావించి ఆరుగురు బాలికలు ఒకేసారి విషం తాగారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాశంగా మారింది.
కాస్మా ప్రాంతంలో ఈ ఆరుగురు బాలికలు నివాసం ఉండేవారు. వీరందరి మధ్య మంచి స్నేహం ఉందని స్థానికులు చెప్పారు. అందులో ఓ బాలిక వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని సమాచారం. యువకుడు పెళ్లికి నిరాకరించడం వల్ల మనస్తాపానికి గురైన బాలిక.. విషం తాగింది. దీంతో మిగిలిన ఐదుగురు స్నేహితులు సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారు మగధ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.
దెయ్యం భయంతో: అయితే ఆస్పిత్రిలో చికిత్స అనంతరం ఓ బాలిక చెప్పిన విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రేమలో విఫలమైన అమ్మాయి చనిపోవాలనుకుందని, తనతో పాటు అందరికీ విషం ఇవ్వకపోతే దెయ్యమై అందర్నీ చంపేస్తానని భయపెట్టిందని తెలిపింది. అందుకే అందరు కలిసి విషం తాగినట్లు చెప్పింది. దెయ్యం విషయాలు మాట్లాడుకుని భయపడటం వల్లే బాలికలంతా కలిసి విషం తీసుకున్నట్లు తెలుస్తోంది.
'బాలిక తన ప్రేమను తన స్నేహితురాళ్ల ద్వారా యువకుడికి తెలియజేసింది. కానీ యువకుడు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆరుగురు బాలికలు తమ గ్రామానికి వచ్చారు. యువకుడిని ప్రేమిస్తున్న బాలిక తొలుత విషం తాగింది. దీన్ని చూసి మిగిలిన ఐదుగురు కూడా విషం తాగారు. వీరందరి వయసు 12 నుంచి 16 మధ్య ఉంది. అందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారే. మిగితావారు ఎందుకు విషం తాగారనే కోణంలో విచారణ జరుపుతున్నాం' అని ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్ర తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రేమను కాదన్న యువతి హత్య.. నీటిలో తోసి.. మళ్లీ వచ్చి కత్తితో పొడిచి..