చైనా సరిహద్దు వెంట పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నప్పటికీ.. ఇప్పుడే అంచనా వేయలేమని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యలో బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. ఆర్మీ డేకు ముందు మీడియా సమావేశం నిర్వహించిన మనోజ్‌పాండే.. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి దుశ్చర్యనైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా మన సైన్యానికి ఉందన్నారు. ఇరుదేశాల సైన్యాలు ఏడు అంశాల్లో ఐదింటిని చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై సైనిక, రాయబార స్థాయిలో చర్చలు కొనసాగుతాయని జనరల్ మనోజ్‌పాండే స్పష్టం చేశారు.
జమ్ము కశ్మీర్‌లో 2021 ఫిబ్రవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బాగానే అమలవుతున్నప్పటికీ.. ఉగ్రవాదం, ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలకు సీమాంతర మద్దతు కొనసాగుతున్నట్లు జనరల్ మనోజ్‌పాండే ఆరోపించారు. మరోవైపు ఆర్టిలరీ యూనిట్లలో మహిళా సైనికులకు చోటు కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు జనరల్ మనోజ్‌పాండే వెల్లడించారు.