Mother with Three Kids jumps into Manair Dam : మతాలు వేరైనా ప్రేమ వాళ్లను ఒకటి చేసింది. సమాజం అదో రకంగా చూసినా.. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోయినా.. కలిసుండటానికి మనసులు కలిస్తే చాలు.. మతాలు కలవాల్సిన అవసరం లేదని భావించి.. అందర్నీ ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ముగ్గురు సంతానం కలిగారు. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లతో ఆ కుటుంబం కళకళలాడిపోయింది. ప్రేమలో గెలిచిన ఆ జంట.. ప్రపంచాన్నే జయించినంత ఆనందం పొందింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. మద్యం అనే మహమ్మారి ఆ హ్యాపీ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. పచ్చని కాపురాన్ని నిప్పుల కుంపటిగా మార్చింది.
Woman Jumps into Dam with Kids in Sircilla : ప్రేమించినప్పుడు ఉన్నట్టుగా భర్త పెళ్లి తర్వాత లేడని భార్య ఫిర్యాదు. కుటుంబ బాధ్యతలు పెరిగిపోయాయని భర్త బాధ. ఇద్దరూ ఒకరి సమస్యను మరొకరు అర్థం చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన భర్తను చూసి తట్టుకోలేకపోయింది భార్య. కుటుంబ బాధ్యతను విస్మరిస్తున్నావని పదేపదే గుర్తు చేసింది. ఇలా చిన్నచిన్నగా మొదలైన గొడవ వారి కాపురంలో కుంపటి పెట్టింది. కుటుంబ సమస్యలు ఓవైపు.. ఆర్థిక ఇబ్బందులు ఇంకోవైపు.. ఆ ఇల్లాలిని మనశ్శాంతిగా ఉంచలేకపోయాయి. తీవ్ర మనోవేదన చెందిన ఆ మహిళ చావే శరణమని భావించింది. తను ఉండగానే పిల్లలను పట్టించుకోని భర్త.. తను చనిపోతే ఏం చూసుకుంటాడని భావించిందో ఏమో.. ముగ్గురు పసిపిల్లలను వెంట తీసుకుని డ్యామ్‌లో దూకి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి దూకింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వారి మృతదేహాలు పైకి తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేములవాడ మండలం రుద్రవరానికి చెందిన రజిత, కరీంనగర్ వాసి మహమూద్ అలీ పదేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఏడేళ్ల అయాన్ , ఐదేళ్ల కూతురు అసరజా సహా 14 నెలల పసికందు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహమ్మద్ అలీ మద్యానికి బానిస కావటంతో కుటుబంలో కలతలు పెరిగాయి. ఈనెల 27వ తేదీన భార్యాభర్తలిద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆలుమగలిద్దరికి సర్దిజెప్పారు. అయినా భర్త తీరు మారకపోవడంతో మనస్తాపం చెందిన రజిత.. ముగ్గురు పిల్లలను తీసుకుని మిడ్‌మానేర్ డ్యామ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అభం శుభం తెలియని చిన్నారులు సహా తల్లి బలవన్మరణం చేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఇవీ చదవండి: