Sidhu moose wala death news: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య వెనక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉందని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా వెల్లడించారు. కెనడాలో ఉండే లారెన్స్ గ్యాంగ్ సభ్యుడైన లక్కీ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడని తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మూసేవాలాకు ఇద్దరు కమాండోల సెక్యూరిటీ ఉందని, వారిని అతడు వెంట తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారునూ ఉపయోగించలేదని చెప్పారు.
"కారును స్వయంగా నడుపుతూ ఇంట్లో నుంచి బయల్దేరాడు సిద్ధూ మూసేవాలా. దారిలో రెండు కార్లు అతడి కారును అడ్డగించి కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ కారణంగానే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. పంజాబ్ పోలీసు శాఖ అతడికి ఇద్దరు కమాండోలతో రక్షణ కల్పించేది. ఇటీవల ఇద్దరిని ఉపసంహరించుకుంది. మరో ఇద్దరు అతడికి రక్షణగా ఉంటారు. అయితే, ఘటన సమయంలో కమాండోలను మూసేవాలా వెంటతీసుకెళ్లలేదు. గాయకుడికి ప్రైవేటు బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. దానిని కూడా తీసుకెళ్లలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సిట్ ఏర్పాటు చేస్తున్నాం."
-వీకే భావ్రా, పంజాబ్ డీజీపీ
కాల్పులకు మూడు ఆయుధాలను వాడినట్లు తెలుస్తోందని డీజీపీ తెలిపారు. 30 ఖాళీ బులెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ హత్యకు తానే కారణమంటూ పోస్టులో పేర్కొన్నాడు. గోల్డీ బ్రార్ సైతం కెనడాలోనే నివసిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జాబితాలో అతడి పేరు ఉంది.
మాన్సా జిల్లాలో జీపులో వెళ్తుండగా ఆయన బృందంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. సిద్ధూ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విని షాక్ అయినట్లు ట్వీట్ చేశారు. సిద్ధూ ఆత్మీయులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సింగర్ మృతి పట్ల స్పందించిన సీఎం భగవంత్ మాన్.. బాధ్యుల్ని విడిచిబెట్టబోమని అన్నారు.
గతేడాది డిసెంబర్లో సిద్ధూ.. కాంగ్రెస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు.. ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా గతంలో ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తేరీ మేరీ జోడీ', మోసా జఠ్.. వంటి చిత్రాల్లోనూ నటించారు. 2020 జులై కొవిడ్ లాక్‌డౌన్ విధించినప్పుడు ఫైరింగ్ రేంజ్‌లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదు నమోదైంది.
ఇదీ చదవండి: