కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జితిన్ ప్రసాద లక్ష్యంగా హస్తం సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే భాజపాలోకి వెళ్లారని అన్నారు. కాంగ్రెస్‌ను వీడటం ఆయన వ్యక్తిగత విషయమని, అయితే భాజపాలో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.
"పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖపై అదిష్ఠానం స్పందనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను వీడితే అది ఆయన వ్యక్తిగతం అయ్యేది. కానీ భాజపాలో చేరాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని జితిన్ చెబుతున్నారు. అన్నేళ్ల పాటు వ్యతిరేకించిన ఓ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? 'ప్రసాద రాజకీయాల' (వ్యక్తిగత ప్రయోజనాలు) కోసం తప్ప భాజపాలో చేరడం వెనక హేతుబద్ధమైన కారణాలు లేవు. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
అయితే తాను మాత్రం వేరే పార్టీలో చేరేది లేదని కపిల్ సిబల్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసిన వారిలో 22 మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తమ గళాన్ని వినిపిస్తామని అన్నారు. పార్టీ తనను వద్దనుకుంటే భాజపాలో చేరనని స్పష్టం చేశారు.
దేశంలో సిద్ధాంతాలను పక్కనపెట్టి సొంత ప్రయోజనాలకు పాటుపడటం తనను ఆందోళనకు గురిచేస్తోందని కపిల్ వ్యాఖ్యానించారు. అధికార దాహం తప్ప.. హరియాణాలో చౌతాలాకు భాజపాకు మధ్య పొత్తుకు అర్థం లేదని ఈ సందర్భంగా ఉదహరించారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం జితిన్‌పై విమర్శలు కురిపించారు. క్రికెటర్లు ఐపీఎల్ టీమ్‌లను మార్చుకున్నట్లు రాజకీయ నేతలు పార్టీలను మార్చడం ఏంటని ప్రశ్నించారు.
పదవుల కోసం కాదు: జితిన్
అయితే, తాను కాంగ్రెస్‌ను వీడింది పదవుల కోసం కాదని జితిన్ వివరణ ఇచ్చారు. ప్రజల నుంచి పార్టీ దూరం జరిగిపోతోందని అన్నారు. ఓటరు బేస్ క్రమంగా పడిపోతోందని చెప్పారు. భాజపాలో చేరాలని తీసుకున్న నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నది కాదని, ఎన్నో దఫాల చర్చల అనంతరం ఇది జరిగిందని తెలిపారు.
ఇదీ చదవండి: దెహ్రాదూన్‌లో మెరుపు వరద- దెబ్బతిన్న రోడ్లు