అప్పటివరకు కలిసి మద్యం సేవించిన ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులుగా మారారు. ఒకరినొకరు చంపుకోవాలని యత్నించారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏం జరిగిందంటే..?
చెన్నై తొందియార్పేట్లోని రేషన్ షాపు వెనకాల స్నేహితులైన అజయ్(24), సంతోష్(22).. ఆగస్టు 8న మద్యం సేవించారు. అయితే.. అక్కడ ఏదో విషయంలో తగాదా రాగా.. అజయ్ కత్తితో సంతోష్‌ను పొడిచాడు. దాంతో ఆగ్రహానికి గురైన సంతోష్.. అతడి చేతిలోంచి అదే కత్తిని లాక్కుని అజయ్‌ను పొడిచి, అక్కడి నుంచి పరారయ్యాడు.
మరో స్నేహితుడొచ్చి..
అనంతరం.. ఈ గొడవ విషయాన్ని సంతోష్ తన మరో స్నేహితుడైన శేఖర్‌కు తెలియజేశాడు. అజయ్‌ను తన స్నేహితులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. సంతోష్ తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి అక్కడకు వచ్చాడు. కోపంతో ఉన్న శేఖర్.. అజయ్‌ను బండ రాయితో మోదాడు.
తీవ్రంగా గాయపడ్డ అజయ్‌ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి: సరిహద్దులో 'ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్ల కలకలం
ఇదీ చూడండి: 21 రకాల 10 రూపాయల నాణేలతో యువకుడి రికార్డు