Shiv Sena Disqualification Hearing : మహారాష్ట్రలో శివసేనకు చెందిన రెండు వర్గాల (శిందే, ఉద్ధవ్) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. తన వద్దనున్న ఈ అనర్హత పటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి చెప్పాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు చివరి అవకాశాన్నిచ్చింది. ఈ పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే టైమ్ షెడ్యూల్‌తో తాము సంతృప్తి చెందలేదని ప్రధాన న్యామూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దసరా సెలవుల సమయంలో తాను వ్యక్తిగతంగా స్పీకర్‌తో చర్చిస్తానని సొలిసిటర్ జనరల్ చెప్పారని తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
'ఆ విషయం తెలుసుకోవాలి'
తన వద్ద పెండింగ్‌లోని అనర్హత పటిషన్లపై మంగళవారం మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పందించారు. ఏ నిర్ణయం రాగ్యాంగ విరుద్ధం అవుతుందో అనే విషయాన్ని తాను తెలుసుకోవాలని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు సమర్పిస్తానన్నారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, సుప్రీం కోర్టులో విచారణ ముగిసిన తర్వాతే ఈ అంశంలో స్పష్టత వస్తుందని అన్నారు.
స్పీకర్‌పై సుప్రీం ఆగ్రహం..
Shiv Sena Dispute Supreme Court : అంతకుముందు ఈ విషయంపై శుక్రవారం (అక్టోబర్ 13) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని స్పష్టం చేసింది.
ధర్మాసనం హెచ్చరిక..
ఈ వ్యవహారాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో కాల వ్యవధి చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. లేకపోతే మొత్తం ప్రక్రియే అసంపూర్ణమవుతుందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి తమను సంతృప్తి పరచని పక్షంలో రెండు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని తామే ఆదేశిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది.
అంతకుముందు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఇతర శివసేన (శిందే వర్గం) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలవ్యవధిని చెప్పాలంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 18న ఆదేశించింది.
శిందేపై వేటు.. సీఎంగా పవార్.. బీజేపీ కొత్త స్కెచ్ ఇదేనా?
'శివసేన బాలాసాహెబ్'గా శిందే వర్గం.. రెబల్ ఎమ్మెల్యేలపై ఠాక్రే చర్యలు