మహారాష్ట్ర శివసేనలో ఏక్నాథ్ శిందే- ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పోరు మరింత తీవ్రం కానుందా? శాసనసభలో అసలు ఠాక్రే వర్గమే లేకుండా చేయాలని శిందే వర్గం చూస్తోందా? ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు అందరిపై త్వరలో అనర్హత వేటు పడనుందా?.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే జవాబు వినిపిస్తోంది. ఉద్ధవ్ వర్గానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు దూరమయ్యే అవకాశముందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు రాహుల్. వారందరినీ అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే 20 పిటిషన్లు అందాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
పోటాపోటీ విప్‌లు: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం చర్చనీయాంశం కావడానికి కారణం.. బలపరీక్ష సమయంలో శిందే, ఠాక్రే వర్గాలు పోటాపోటీగా విప్‌లు జారీ చేయడమే. అయితే.. ఠాక్రే వర్గం ఇచ్చిన విప్‌ను బేఖాతరు చేస్తూ శిందే వర్గం ఎమ్మెల్యేలంతా బలపరీక్షలో అనుకూలంగా ఓటేశారు. స్పీకర్ ఎన్నిక సమయంలోనూ ఇదే తరహాలో విప్‌ను ధిక్కరించారు.
శిందే అనుచరుడు భరత్ గోగావాలేను స్పీకర్ రాహుల్ చీఫ్ విప్‌గా గుర్తించడాన్ని సవాలు చేస్తూ ఠాక్రే వర్గం న్యాయపోరాటానికి దిగింది. ఇందుకు దీటుగా.. ఠాక్రే వర్గంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది శిందే వర్గం. విప్‌ను ధిక్కరించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సభాపతికి ఫిర్యాదు చేశారు భరత్ గోగావాలే. ఇలా మొత్తం 20 ఫిర్యాదులు అందాయని, అన్నింటినీ పరిశీలించి ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు స్పీకర్ రాహుల్ నర్వేకర్.
ఏక్నాథ్ శిందే ప్రభుత్వం రెండున్నరేళ్లు అధికారంలో ఉండి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. స్పీకర్ అధికారాలు, బాధ్యతలకు లోబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. శిందే వర్గం తమ పార్టీలో (భాజపా) విలీనం అవుతుందా అని అడిగితే.. కాదనే జవాబిచ్చారు రాహుల్. శిందే వర్గానికి మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని గుర్తు చేశారు. తాను శివసేనలోనే ఉన్నానని శిందే కూడా ఇప్పటికే చెప్పారని, అసలు విలీనం కావాల్సిన అవసరం కూడా లేదని అన్నారు రాహుల్. మరోవైపు.. లోక్‌సభలో శివసేన చీఫ్ విప్‌ను మార్చింది శిందే వర్గం. భావనా గవాలీ స్థానంలో రాజన్ విచారేను నియమించింది.