కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆంగ్ల పదజాలం, వాగ్దాటి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఉపయోగించే కొన్ని పదాలు ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారికే తప్ప సామాన్యులకు అర్థం కావు. ఎక్కువగా అంతర్జాతీయ అంశాలను ఉటంకిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు నవ్వుతెప్పించే కామెంట్లు కూడా జతచేస్తుంటారు. తాజాగా జూన్ 4 నాటి వార్తా పత్రికలో ఓ వివాహ ప్రకటనకు సంబంధించిన క్లిప్‌ను జత చేస్తూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చదివేయండి మరి..
ఒక యువతి ఉద్యోగం చేస్తోంది. కరోనా నేపథ్యంలో రెండు డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను పూర్తి చేసుకుంది. ఆమె ఓ పత్రికలో వివాహ ప్రకటన చేస్తూ.. తనకు కాబోయే వరుడు కూడా రెండు డోసులు పూర్తి చేసుకున్న వాడై ఉండాలని షరతు విధించింది. అది శశిథరూర్ దృష్టిలో పడింది. దీనికి సంబంధించిన క్లిప్‌ను ఆయన జత చేస్తూ.. " చూడ్డానికిదేదో పెళ్లి ప్రకటనలా ఉంది. వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వధువుకు.. రెండు డోసుల టీకాల పూర్తయిన వరుడే కావాలట. వీరి పెళ్లికి బూస్టర్ షాట్.. సరైన బహుమతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సరికొత్త పోకడకు దారితీయదు కదా?" అంటూ సరదాగా రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: డాక్టర్ అవతారంలో దుర్గామాత.. క్రియేటివిటీకి థరూర్ ఫిదా
థరూర్ పోస్టుపై ప్రియాంక పాండే అనే మహిళ స్పందించారు. భవిష్యత్‌లో పెళ్లి చేసుకునేవారికి ఇదొక ప్రామాణికంగా మారుతుందేమో! అని సమాధానమిచ్చారు. నమ్మలేకపోతున్నా.. నిజంగా ఇలా జరుగుతుందా? అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి: 'భాజపా రాజకీయాలు కేరళలో పనిచేయవు'