Sharad Pawar resigns : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తున్నట్లు తాను తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచిస్తానని శరద్ పవార్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయనతో చర్చించినట్లు ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తెలిపారు. తాను, సుప్రియా సూలే, ఇతర పార్టీ నాయకులు శరద్ పవార్‌ను కలిసి మాట్లాడినట్లు చెప్పారు. ఇందుకు పవార్ సానుకూలంగా స్పందించారని అజిత్ వివరించారు. రెండు, మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని శరద్ పవార్ పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.
"మీ (కార్యకర్తలను ఉద్దేశించి) అందరి వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తా. నాకు రెండు, మూడు రోజుల సమయం కావాలి. కానీ, పార్టీ కార్యకర్తలు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోమ్మని చెప్పండి. నా నిర్ణయంతో పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న వారంతా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి" అని శరద్ పవార్ తమతో చెప్పారని అజిత్ పవార్ వెల్లడించారు. ఎన్సీపీ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగుతారని అజిత్ స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)ను నియమిస్తారని తెలిపారు.
ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం అనూహ్య ప్రకటన చేశారు శరద్ పవార్. కొత్త తరం నాయకులు పార్టీని నడిపించే సమయం ఆసన్నమైందని పేర్కొంటూ చెప్పుకొచ్చారు. తదుపరి అధ్యక్షుడి ఎంపికపైనా మాట్లాడారు. పార్టీలోని నాయకులు ఓ కమిటీగా ఏర్పడి ఎన్సీపీ తర్వాతి అధ్యక్షుడిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని శరద్ పవార్ వెల్లడించారు. అయితే, పార్టీ నేతలంతా ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ కార్యకర్తలు ఏకంగా ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తల ఒత్తిడి నేపథ్యంలో ఎన్సీపీ నేతలు అప్రమత్తమయ్యారు. అజిత్ పవార్, సుప్రియా సూలే సహా ఇతర పార్టీ నాయకులు.. శరద్ పవార్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేశారు.
అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తెస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో శరద్ పవార్ ఈ నిర్ణయం ప్రకటించడం చర్చనీయాంశమైంది. పార్టీలోని ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతున్నారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిని ఇప్పుడైనా చేజిక్కించుకోవచ్చని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు సైతం సంచలనమయ్యాయి. ఈ క్రమంలో తాజా పరిణామాలు కీలకంగా మారాయి. అయితే, తన రాజీనామాపై ఆలోచిస్తానని శరద్ పవార్ చెప్పినట్లు వస్తున్న వార్తలతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లైంది.