కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు వైద్యులు.. మంగళవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించారని మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఎండోస్కోపీ ద్వారా పిత్తాశయం(గాల్‌బ్లాడర్)లోని రాళ్లను తొలగించారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.
పవార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వైద్యుడు అమిత్ మాయ్దేవ్ వెల్లడించారు. ఈ చికిత్స అరగంట పాటు కొనసాగిందని చెప్పారు. పిత్తాశయాన్ని పూర్తిగా తొలగించే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. పవార్‌ను ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లు వివరించారు.
ఇటీవల అస్వస్థతకు గురైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం.. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. పొత్తికడుపులో నొప్పి రావడం వల్ల ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'అమిత్ షా-పవార్ల మధ్య భేటీ జరగనేలేదు'